మంచు విష్ణు, శ్రీనువైట్ల కలయికలో వచ్చిన ‘ఢీ’ కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించింది. మంచు విష్ణు కెరీర్లో పెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకి ఈ సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. అయితే విష్ణు నుండి సరైన ప్రకటన రాకపోవడంతో సీక్వెల్ వుండదనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఈ ఊహాగానాలకు చెక్ పెట్టారు విష్ణు. ‘ఢీ’ సీక్వెల్ డిసెంబర్ లో సెట్స్ పైకి వెళుతుందని క్లారిటీ ఇచ్చారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో పూర్తిగా కొత్త కథతో ఢీ సీక్వెల్ ఉంటుందని చెప్పారు.
అలాగే తన భవిష్యత్ ప్రణాళిక కూడా ప్రకటించారు. మొత్తం ఏడు సినిమాల రిమేక్ హక్కులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందులో ఆండ్రాయిడ్ కట్టప్ప కూడా వుంది. ఈ సినిమాని తండ్రి మోహన్ బాబుతో కలసి చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే మిగతా సినిమాల వివరాలు నవంబర్ లో ప్రకటిస్తామని చెప్పారు. కొన్ని సినిమాలు బయట హీరోలతో కూడా చేస్తున్నట్లు వెల్లడించారు. విష్ణు జిన్నా 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.