ఈ రోజు నుంచి రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని పవన్ కల్యాణ్ పార్టీ ఆఫీసులో ప్రకటించారు. మధ్యాహ్నం నిజంగానే మార్చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నోవాటెల్ హోటల్లో సమావేశం అయ్యారు. విశాఖలో పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్న ఘటనపై సంఘిభావం తెలిపేందుకు చంద్రబాబు నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు. ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో నాగబాబు, నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్సీపీ మళ్లీ గెలవడకూడదని..వైసీపీ విముక్త ఏపీ కావాలని పవన్ కల్యాణ్ కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఇందు కోసం తాను ఓట్లు చీలకుండా చూస్తానని ప్రకటిస్తూ వస్తున్నారు. ఓ సందర్భంగా వైఎస్ఆర్సీపీని ఓడించడానికి బీజేపీని రూట్ మ్యాప్ అడిగానని చెప్పారు. అయితే ఉదయం మీడియాతో మాట్లాడిన సమయంలో బీజేపీ ఎలాంటి రూట్ మ్యాప్ ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తులో ఉన్నాం కానీ బలంగా కలిసి వెళ్లలేకపోయామన్నారు. ప్రభుత్వంపై పోరాడలేకపోయామన్నారు. మోదీ అంటే గౌరవం ఉంది కానీ బానిసత్వం మాత్రం లేదన్నారు. ఇలా బీజేపీ పై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేయడం .. కాసేపటికే.. నోవాటెల్ హోటల్లో పవన్ తో చంద్రబాబు భేటీ కావడంతో రాజకీయంగా ఊహాగానాలు రావడానికి కారణం అవుతోంది.
అయితే ప్రస్తుతం పవన్ , చంద్రబాబు మధ్య భేటీ రాజకీయ పొత్తుల గురించి కాదని.. జనసేన, టీడీపీ వర్గాలు చెబుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు పవన్ కల్యాణ్ ఖండించారు. అలాగే పలువురు టీడీపీ నేతలపై దాడి చేసినప్పుడు ఖండించారు. అందుకే చంద్రబాబు పవన్ కల్యాణ్‌కు సంఘిభావం తెలిపేందుకు ప్రత్యేకంగా సమావేశమయ్యారని చెబుతున్నారు అయితే జనసేన, టీడీపీ మధ్య సత్సంబంధాలకు ఈ సమావేశం మంచి మార్గం అవుతుందని రెండు పార్టీల నేతలు అంటున్నారు. సమావేశంలో నాదెండ్ల మనోహర్, నాగేంద్ర బాబు కూడా పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ దాష్టీకాలను ఎదుర్కోవాలంటే కలసి పోరాడాల్సిందేనన్న అభిప్రాయానికి అందరూ వచ్చినట్లుగా తెలుస్తోంది.