చిన్న సినిమాలకు సంబంధించి విధి-విధానాలను ఖరారు చేసింది నిర్మాతల మండలి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ . తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి సినీ పెద్దలు సమక్షంలో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా చిన్న సినిమాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. రూ.4కోట్ల రూపాయలు బడ్జెట్‌గా ఉన్న దానిని చిన్న సినిమాగా పరిగణించనున్నట్లు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ప్రకటించింది.
సినిమా బడ్జెట్ కమిటీకి తెలిపేందుకు ఛాంబర్ తయారుచేసిన ప్రొఫార్మాలో సదరు సినిమాకు పనిచేసే ముఖ్యమైన టెక్నీషియన్స్, నటీనటులు పారితోషికాలు సహా సంతకాలు చేయించి ఎన్నిరోజుల్లో మూవీ పూర్తి చేస్తారో వివరాలు తెలిపాలి. ఈ బడ్జెట్‌ను నిర్మాతతో పాటు, డైరెక్టర్, మేనేజర్ తయారు చేసి ఇవ్వాలి. చిన్న సినిమాగా ఆమోదించిన తర్వాత ఫెడరేషన్ వారు ఆ ప్రొడ్యూసర్‌కి కచ్చితంగా 15శాతం తగ్గించి వేతనాలు తీసుకోవాలి. దానిని ఫెడరేషన్ బాధ్యతగా అమలు చేయాలి. అయితే ఒకవేళ ఆ బడ్జెట్ ఎక్కువైతే దానికి దర్శకుడు బాధ్యత వహించాలి. చిన్న సినిమాల బడ్జెట్‌ను పరిశీలించి ఆమోదం తెలిపి వారికి లెటర్స్ ఇచ్చే భాత్యతను ఛాంబర్లో ఫెడరేషన్ నుంచి ఇద్దరు, ఛాంబర్ నుంచి ఇద్దరు చూస్తారు.