నయనతార దంపతుల సరోగసీ వ్యవహారం రోజు రోజుకీ మలుపులు తిరుగుతోంది. సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చామని నయన దంపతులు ప్రకటించిన తరవాత… జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. సరోగసీ చట్టబద్దమా, కాదా? సరోగసీ విషయంలో నయన తార దంపతులు నిబంధనల్ని పాటించారా, లేదా? అనే విషయంపై తమిళనాడు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ త్రిసభ్య కమిటీ వేసింది. సరోగసీ ద్వారా పిల్లలు కనాలంటే పెళ్లయి కనీసం ఐదేళ్లు అవ్వాలన్న నిబంధన ఉంది. పైగా యేడాది ముందే సరోగసీ విషయంలో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ రెండూ… నయన పాటించలేదు. పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసీ ద్వారా పిల్లలు కన్నారు. దాంతో.. నయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది.
ఈలోగా నయన ఓ ట్విస్టు ఇచ్చింది. తమకు ఆరేళ్ల క్రితమే పెళ్లయ్యిందని, యేడాది క్రితం సరోగసీ కోసం తమ పేర్లు నమోదు చేయించుకొన్నామని ప్రకటించారు ఈ దంపతులు. అయితే.. వాటికి సంబంధించిన ఆధారాలను ఇవ్వలేదు. దాంతో ప్రభుత్వం ఈ విషయంపై మరింత లోతుగా విచారణ జరపాలని నిర్ణయం తీసుకొంది. నేరుగా నయన తార ఇంటికే వెళ్లి.. విచారణ మొదలెట్టాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నయనకు నోటీసులు కూడా అందించారు. విచారణకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈలోగా నయన ఆధారాలు సేకరించి ఉంచాల్సి ఉంది. ఆధారాలు లేని పక్షంలో.. ఈ సరోగసీ చట్ట వ్యతిరేకమని త్రిసభ్య కమిటీ భావించే ప్రమాదం ఉంది. అదే జరిగితే నయన దంపతులకు, సరోగసీకి సహకరించిన వారికీ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.