‘మా’కి బిల్డింగ్ కట్టి పెడతా.. అనే ఒకే ఒక్క నినాదంతో… ‘మా’ పీఠమెక్కాడు మంచు విష్ణు. ఆయన పదవి చేపట్టి యేడాది అయ్యింది. అయినా.. `మా` బిల్డింగ్ వ్యవహారం ఇంకా తేలలేదు. అయితే… ‘ఇదిగో. అదిగో’ అని ఊరించడం మాత్రం మానలేదు విష్ణు. తాజాగా ‘ఫిల్మ్ ఛాంబర్‌లోనే ‘మా’ బిల్డింగ్’ అంటూ ఇంకో స్టేట్మెంట్ పాస్ చేశారు. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్లో ఫిల్మ్ ఛాంబర్ ఉంది. ఆ ఛాంబర్ లోనే ‘మా’కి ఓ చిన్న గది ఉంది. అది సరిపోక పోవడం వల్లే…’మా’ కోసం ప్రత్యేకంగా ఓ భవనం కావాలన్న నినాదం బయటకు వచ్చింది. ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ కూల్చేసి, కొత్తగా ఓ భవనం నిర్మించే పనిలో ఉన్నారు. అందులోనే.. ‘మా’ కోసం స్పేస్ కొంటానని విష్ణు చెబుతున్నాడు. దీనికి `మా` సభ్యులంతా ఆమోద ముద్ర వేశార్ట.
అయితే ఈ ప్రకటన వెనుక చాలా లొసుగులు, అనుమానాలూ ఉన్నాయి. ఛాంబర్ బిల్డింగ్ పడగొట్టి, కొత్త భవనం నిర్మించాలన్న ప్రతి పాదన అయితే ఉంది. అయితే అది ఇప్పుడు తేలదు. కనీసం మూడు నాలుగేళ్లు పడుతుంది. ఈ విషయం విష్ణు నే స్వయంగా చెప్పాడు. అంటే… నాలుగేళ్ల తరవాతి మాట ఇది. మరో యేడాదిలో విష్ణు పదవీ కాలం పూర్తవుతుంది. అంటే.. తన హయాంలో ‘మా’ భవనం చూడలేమన్నమాట.
ఛాంబర్ స్థలంలో ‘మా’కి స్పేస్ ఎందుకు ఇస్తారన్నది మరో ప్రధానమైన అనుమానం. విష్ణు డబ్బులు పోసి కొంటానన్నా… ఛాంబర్ వాళ్లు తమకోసం కట్టుకొంటున్న భవనంలోకి ‘మా’ని ఎందుకు రానిస్తారు? డబ్బుల కోసం స్థలాన్ని అమ్మేస్తారనే అనుకొందాం. ఛాంబర్ కి నిధుల సమస్య అంటూ లేదు కదా? అలాంటప్పుడు విష్ణు ఇచ్చే డబ్బుల కోసం ఎందుకు ఎదురు చూస్తారు? పైగా ఇప్పుడన్న ఫిల్మ్ చాంబర్ మంచి కమర్షియల్ ఏరియా. అక్కడ షాపింగు కాంప్లెక్సులు కట్టుకొన్నా… ఛాంబర్ కి ఆ రూపంలో బోలెడంత ఆదాయం వస్తుంది. స్థలం చూపించి, బ్యాంకు లోను తీసుకొని, ఆ లోనుతో విలాసవంతమైన భవనం నిర్మించుకోవచ్చు. వాళ్లకు మంచు విష్ణు ఇచ్చే డబ్బులు అవసరం లేదు. పైగా ఛాంబర్‌కి సంబందించిన ఏ నిర్ణయమైనా.. అంతా కలిసి తీసుకోవాలి. ఛాంబర్ సభ్యుల్ని విష్ణు సంప్రదించాడా? వాళ్ల అనుమతితోనే ఈ ప్రకటన చేశాడా? ‘మా’ భవనం కోసం విష్ణు ఛాంబర్ కి ఎంత మొత్తం ఇవ్వాలనుకొంటున్నాడు? ఇవన్నీ అనుమానాలే.
మా భవనం.. అప్పట్లో ప్రతిష్టాత్మకమైన టాపిక్కు. కల్యాణ మండపం, మీటింగ్ హాట్, స్విమ్మింగ్ పూల్, గెస్ట్ రూములు.. అంటూ పెద్ద చిట్టా విప్పారంతా. ఛాంబర్‌లోనే మాకి స్పేస్ కొంటే.. ఇవేం అందులో ఉండవు. ఇప్పుడు ఒక్క గది ఉంది. అప్పుడు మరో నాలుగైదు గదులు పెరుగుతాయేమో. అంతే తేడా.