పార్టీకి ఉపయోగం లేదనుకున్న వారిని జగన్ పంపేస్తున్నారు. పార్టీకి ఏమీ చేటు చేయకపోయినా ముందు ముందు పార్టీలో అసంతృప్తి అంటూ బయటకు రాకూడదని వరుసగా నేతల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మొన్న పొన్నూరు నియోజకవర్గానికి చెందిన రావి వెంకటరమణను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సీఎం జగన్.. తాజాగా పామర్రు నియోజకవర్గానికి చెందిన డీవై దాస్‌కూ అదే ట్రీట్మెంట్ ఇచ్చారు. వీరిద్దరూ పార్టీ పెట్టినప్పటి నుండి జగన్ వెంట ఉన్నవారే కావడం అసలు విశేషం.
పొన్నూరు నియోజకవర్గానికి చెందిన రావి వెంకటరమణ చాలా కాలంగా ధూళిపాళ్లపై పోరాడారు. భారీగా ఖర్చు పెట్టుకుని రెండు సార్లు ఓడిపోయారు. గత ఎన్నికల్లో చివరి క్షణంలో పొన్నూరుతో సంబంధం లేని ఉమ్మారెడ్డి అల్లుడు రోశయ్యకు సీటిచ్చి… అప్పటి వరకూ ఖర్చు పెట్టుకుని పని చేసుకున్న రావి వెంకటరమణకు షాకిచ్చారు. అయినా ఆయన ఏదో ఓ అవకాశం కల్పిస్తారని ఎదురు చూస్తూ పార్టీలో ఉన్నారు. ఏమీ కల్పించకపోగా ముందు ముందు టిక్కెట్ అడుగుతారేమోనన్న ఉద్దేశంతో పార్టీ నుంచి గెంటేశారు. దీంతో ఆయన తన సస్పెన్షన్‌కు కారణం చెప్పాలంటున్నారు.
ఇప్పుడు డీవై దాస్‌దీ అదే పరిస్థితి. ఎన్నికల ముందు జగన్ హామీతో వైసీపీలో చేరారు. అయితే వైఎస్ జగన్ టిక్కెట్ ఇవ్వలేదు. అయినా పార్టీలోనే ఉన్నారు. నాలుగేళ్లుగా వైసీపీలోనే కొనసాగుతున్నానని, స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ తనను ఏ కార్యక్రమానికి ఆహ్వనించలేదని..ఆయనంటున్నారు. అయినా ఇప్పటివరకు పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యవహరించలేదని ఎలాంటి సంతకం లేకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్న లేఖలో వాస్తవం లేదని తాను అనుకుంటున్నానని డీవైదాస్ అంటున్నారు. కానీ విషయం ఆయనకు అర్థం కాలేదు.
వీరే కాదు.. టిక్కెట్ ఆశించి ఇవ్వకపోతే.. తిరుగుబాటు చేస్తారనుకున్న వారందర్నీ… ఏరివేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారని.. ఐ ప్యాక్ టీం ఇచ్చే సలహాల మేరకుఈ కార్యక్రమం జరుగుతోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి