పవన్ కల్యాణ్ విషయంలో బీజేపీ సరైన విధంగా వ్యవహరించలేదని ఆ పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. సోము వీర్రాజు ఏకపక్షంగా వ్యవహరించడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని మాజీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. మా పార్టీలో ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదు.. పవన్ తో సోము వీర్రాజు సమన్వయం చేసుకోలేకపోయారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సోము వీర్రాజు ఒక్కడే అన్నీ చూసుకోవడం వల్లే సమస్య వచ్చిందన్నారు. నేరుగా సోము వీర్రాజుపై అసంతృప్తి వ్యక్తం చేయనప్పటికీ… పరోక్షంగా ఇతరులను జోక్యం చేసుకోనీయకుండా అన్నీ తానే అన్నట్లుగా సోము వీర్రాజు వ్యవహరించడం వల్లనే ఇలాంటి సమస్యలు వచ్చాయని చెప్పకనే చెప్పినట్లయింది.
సోము వీర్రాజు ఏపీ బీజేపీ చీఫ్గా బాధ్యతలు చేపట్టక ముందు కన్నానే చీఫ్గా ఉండేవారు. ప్రభుత్వంపై ఓ రేంజ్లో పోరాటం చేశారు. అయితే హఠాత్తుగా బీజేపీ హైకమాండ్ ఆయనను మార్చి ప్రో వైసీపీ ఇమేజ్ ఉన్న సోమును పెట్టింది. దీంతో కన్నా సైలెంట్ అయిపోయారు. అయితే ఆయనకు జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారు. కానీ చేయడానికి ఎలాంటి పని లేకుండా పోయింది. రాష్ట్ర బీజేపీలోనూ ఆయన పాత్రను పరిమితం చేశారు. ఎప్పుడైనా సమావేశాలు ఉంటే తప్ప..బయట కనిపించడం లేదు.
ఇప్పుడు పవన్ కల్యాణ్ బీజేపీకి దూరమైనట్లుగా కనిపిస్తూండటంతో ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పవన్ తో సరిగ్గా వ్యవహరించని తప్పు..సోము వీర్రాజుదేనని చెప్పకనే చెబుతున్నారు. బీజేపీలో ఈ వ్యవాహారం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాల్సి ఉంది. మరో వైపు.. జనసేనతో పొత్తు ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కల్యాణ్ తమతోనే ఉన్నాడని అంటున్నారు.