టీడీపీ, జనసేన పొత్తు ఖాయమన్న ప్రచారం ఊపందుకోగానే.. ఊగిసలాటలో ఉన్న రాజకీయ నేతల్లో కదలకి వచ్చేస్తోంది. కన్నా బీజేపీకి గుడ్ బై చెప్పడం ఖాయమయిపోయింది. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం కష్టమని కన్నాకు అర్తమైపోయింది. కన్నా లక్ష్మినారాయణకు వ్యక్తిగత ఇమేజ్ ఉన్నప్పటికీ పార్టీ పరమైన ఆదరణ లేకపోతే గెలుపొందడం కష్టం. గతంలో గుంటూరు పశ్చిమ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో బీజేపీ తరపున నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టసభల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. అందుకే ఆయన తన రాజకీయ అడుగులు వేగంగా వేస్తున్నారని అంటున్నారు. కన్నా లక్ష్మినారాయణ బీజేపీకి గుడ్ బై చెబితే ఏ పార్టీలో చేరుతారన్న అంశంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. నిజానికి కన్నా లక్ష్మినారాయణ గత ఎన్నికలకు ముందే వైఎస్ఆర్సీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. పాదయాత్రలో ఉన్న జగన్ వద్దకు వెళ్లి కండువా కప్పించుకునేందుకు సిద్ధమయ్యారు. చివరి క్షణంలో అమిత్ షా నుంచి ఫోన్ రావడంతో అనారోగ్యం పేరుతో ఆస్పత్రిలో చేరిపోయారు. ఆ తర్వాత ఆయనకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాల్సి రావడంతో ఆయనతో సహా అందరూ పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని కూడా కోల్పోయారు. .
ఇప్పుడు పార్టీ మారాలనుకుంటే ఆయన మళ్లీ వైఎస్ఆర్సీపీ వైపు చూస్తారా లేక మరో ప్రత్యామ్నాయ పార్టీ వైపు అడుగులు వేస్తారా అన్నదానిపై స్పష్టత లేదు. తాను ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. . జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో కన్నా సాఫ్ట్ గానే ఉంటారు. అయితే ఆ పార్టీలో చేరుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కన్నా బీజేపీపై అసంతృప్తిగా ఉన్నారు… అనుచరులతో సమావేశం అవుతున్నారు. కానీ పార్టీ మారుతారా లేదా అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.