సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ మళ్లీ ఏపీకి వచ్చారు. ఆయనకు ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్‌కు రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్నారు. ప్రవీణ్ ప్రకాష్ వివాదాస్పదమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన గతంలో సీఎంవోలో పూర్తి స్థాయిలో చక్రం తిప్పారు. ఈ క్రమంలో కొన్ని వివాదాస్పదమైన జీవోలు వెలుగులోకి రావడంతో ఆయనను పలు బాధ్యతల నుంచి తప్పించారు.
కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఆయనకు ఉన్న రిమార్కుల కారణంగా.. ఏ శాఖ కూడా ఆయనను తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో ఆయన ఓ సందర్భంలో యూపీ రాజకీయాల్లోకి కూడా వెళ్తారన్న ప్రచారం జరిగింది. చివరికి ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్‌గా వెళ్లారు. అయితే అక్కడ బోర్ కొట్టిందేమో కానీ మళ్లీ ఏపీకి రావాలనుకున్నారు. ఆయన విజ్ఞప్తి చేసిందే తడవుగా ఏపీకి తీసుకురాగలిగారు కానీ.. మళ్లీ సీఎంవోలోకి తీసుకునేంత ధైర్యం చేయలేకపోయారు. ఆయనకు ఆర్ అండ్ బీ పోస్టింగ్ ఇచ్చి సరి పెట్టారు.
ప్రవీణ్ ప్రకాష్ మళ్లీ తనకు సీఎంవో పోస్టింగ్ ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడే కాదని.. తర్వాత చూద్దామని చెప్పి ఆయనకు ప్రస్తుతానికి ఆర్ అండ్ బీ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. ఆయన సీఎంవోలోకి వస్తే మరోసారి అధికార యంత్రాగం అంతా చెల్లాచెదురు అవుతుందన్న ఆందోళన వైసీపీ పెద్దల్లో ఉంది. అందుకే.. ఆయన ఏపీకిరావాలనే కోరికను తీర్చినా.. సీఎంవోలోకి మాత్రం తీసుకోలేకపోయారు. మరోవైపు సీఎస్ సమీర్ శర్మ అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరడంతో విజయానంద్ కొన్నాళ్ల పాటు సీఎస్‌గా వ్యవహరించనున్నారు.