Prince movie review
తెలుగు రేటింగ్: 2.5/5
చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ తమిళ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు శివకార్తికేయన్. తన సక్సెస్ రేటు కూడా ఎక్కువే. వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని కూడా అలరించి, ఇక్కడ కూడా మార్కెట్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి తెలుగు దర్శకుడు, నిర్మాణ సంస్థతో ఓ సినిమా తీశాడు. అదే.. ప్రిన్స్. ట్రైలర్ చుశాక ఇది నవ్వించే సినిమానే భావన కలిగింది. నవ్వించడమే పరమావధిగా జాతిరత్నాలు తీసిన అనుదీప్ ఈ చిత్రానికి దర్శకుడు. మరి ఈ ఇద్దరూ కలసి ప్రేక్షకులు ఎలాంటి వినోదం పంచారు ? అనుదీప్ జాతిరత్నాలు ఫామ్ ని కొనసాగించాడా ?
ఆనంద్ (శివ కార్తికేయన్ ) స్కూల్ లో సోషల్ టీచర్. స్టూడెంట్స్ కంటే తనే ఎక్కువ అల్లరి చేస్తాడు. క్లాస్ ఎగ్గొట్టి సినిమాలకి వెళ్ళే టీచర్ తను. ఆనంద్ తండ్రి విశ్వనాధ్ (సత్య రాజ్) మహా ఆదర్శవాది. ఎంతంటే.. సొంత కులం వాడిని పెళ్లి చేసుకుందని కూతురి పై అలుగుతాడు. సొంత కులం, మతం కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కొడుకు ఆనంద్ తో ఒట్టు వేయించుకొంటాడు. ఆనంద్ పని చేసే స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ గా చేరుతుంది జెస్సికా (మరియా). తను బ్రిటిష్ అమ్మాయి. తొలి చూపులోనే ఆమె ప్రేమలో పడిపోతాడు ఆనంద్. జెస్సికా కూడా ఆనంద్ ని ప్రేమిస్తుంది. జెస్సికా తండ్రికి ఇండియన్స్ అంటే గిట్టదు. అందుకే కూతురి ప్రేమకి అడ్డు చెబుతాడు. ఆదర్శవాది అయిన తన తండ్రి ఈ సమస్యని పరిస్కరిస్తాడని జెస్సికాని తన తండ్రి విశ్వనాథ్ వద్దకు తీసుకొస్తాడు ఆనంద్. వీరి ప్రేమ కథ విన్న ఆనంద్ తండ్రి ఒక్కసారిగా అడ్డం తిరుగుతాడు. అంత ఆదర్శాలు బోధించే విశ్వనాథ్.. ఈ విషయంలో ఎందుకు రివర్స్ అయ్యాడు? బ్రిటీష్ అమ్మాయిని ప్రేమించిన ఆనంద్ కి ఊర్లో ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి ? చివరికి ఆనంద్ తన ప్రేమని ఎలా గెలిపించుకున్నాడనేది మిగతా కథ.
జాతిరత్నాలు గొప్ప కథ కాదు.. కానీ అందరినీ నవ్వించింది. దర్శకుడు అనుదీప్ కామెడీని క్రియేట్ చేసిన కోణం ప్రేక్షకులకు కొత్తగా కనిపించింది. అమాయకత్వం, అల్లరితనం, సీరియస్ ఇష్యూని కూడా నవ్వులాటగా చూడటం ఇవన్నీ పండాయి. ఇప్పుడు అదే స్టైల్ లో ప్రిన్స్ ని కూడా ప్రజంట్ చేశాడు అనుదీప్. అయితే ఈ ప్రయత్నం మాత్రం ఆల్రెడీ నవ్వేసిన జోక్ లా చప్పగా అనిపిస్తుంది. ఆనంద్ ని నగర బహిస్కరణ చేసే క్లైమాక్స్ సన్నివేశంతో కథని ఆసక్తికరంగానే ఓపెన్ చేశారు. ఆదర్శవాదిగా సత్యరాజ్, సోషల్ టీచర్ శివకార్తికేయన్ పాత్రలు సరదాగా పరిచయం అవుతాయి. స్కూల్ లో పిల్లలతో అల్లరి, ‘బొటల్ గార్డ్’ కామెడీ, స్టూడెంట్స్ తో తన ప్రేమ గురించి ఆనంద్ చెప్పే కట్టు కథ, సత్యరాజ్ ‘లస్క్ టపా’ లిరిక్స్ మీనింగ్ చెప్పాలనుకునే ప్రయత్నం.. ఇవన్నీ అనుదీప్ మార్క్ కామెడీతో నవ్విస్తాయి. జెస్సికా, బింబిలిక్కి పాటలతో ప్రధమార్ధం సరదాగానే గడిచిపోతుంది.
అయితే అసలు కథ మొదలైన తర్వాత ప్రిన్స్ నడకలో వేగం తగ్గుతుంది. బ్రిటషర్లు, యుద్ధం, దేశభక్తి, మానవత్వం లాంటి హెవీ ఎలిమెంట్స్ ని తన స్టయిల్ లో డీల్ చేయాలనుకొని ప్రయత్నించాడు అనుదీప్. భూపతి పాత్ర రూపంలో ఒక లాండ్ వార్ ని తీసుకొచ్చాడు. సత్యరాజ్ పాత్రలో దేశభక్తిని చొప్పించాడు. ప్రిన్స్ పాత్రని మానవత్వానికి ప్రతీక చేశాడు. అయితే ఈ విషయాన్ని కొంచెం అర్ధం చేసుకోవడానికే ప్రయత్నిస్తేనే ”ఓ..హో ఇలానా”అనిపిస్తుంది. మాములుగా అయితే మళ్ళీ నవ్వులాటగానే వుంటుంది.
ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ వినోదం తగ్గింది. జాతిరత్నాలు ముగ్గురు అమాయక చక్రవర్తుల అల్లరి కథ. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ .. ముగ్గురూ వినోదాన్ని మోశారు. కానీ ఇక్కడ ప్రిన్స్ ఒక్కడిగా మిగిలిపోయాడు. జాతిరత్నాల్లో పాత్రలన్నీ నవ్వించడమే పరమావధిగా పెట్టుకుంటాయి. ప్రిన్స్ టెంప్లెట్ కూడా అదే. అయితే శివకార్తికేయన్, సత్యరాజ్, కొంతలో కొంత ప్రేమ్ జీ పాత్రలు తప్ప మిగతా పాత్రలు అంత హిలేరియస్ గా డిజైన్ చేయలేదు. దాదాపు అందరూ తమిళనటులే కనిపిస్తారు. కామెడీ టైమింగ్ తేడా అనిపించడానికి ఇదీ ఓ కారణం. కథ ముగించడం విధానంలో కూడా జాతిరత్నాలు ఫార్మెట్ నే అనుసరించాడు అనుదీప్. జాతిరత్నాలలో అర్ధం పర్ధం లేని కోర్ట్ సీన్ వుంటే.. ప్రిన్స్ లో గ్రామస్తుల సమక్షంలో అర్ధం పర్ధం లేని మాటలతో ‘మానవత్వం’ స్పీచ్ ని దంచికొడతాడు. తమిళ ఆడియన్స్ కి ఇది కొత్తగా ఉండొచ్చు. కానీ జాతిరత్నాలు చూసిన కళ్ళకి రిపీట్ అనిపిస్తుంది.
శివకార్తికేయన్ మంచి కామెడీ టైమింగ్ వున్న నటుడు. ఆనంద్ పాత్రని చాలా సహజంగా, చాలా సులువుగా చేశాడు. తన టైమింగ్, గ్రేస్ అభిమానుల్ని ఆకట్టుకుంటాయి. అయితే అనుదీప్ చాలా చోట్ల అనంద్ పాత్రకు జాతిరత్నాలు శ్రీకాంత్ మేనరిజమ్స్ ఇచ్చాడనిపిస్తుంది. శివకార్తికేయన్ డ్యాన్సులు బాగున్నాయి. ఫ్లెండ్లీ ఫాదర్ గా సత్యరాజ్ నటన నవ్విస్తుంది. అయితే ఆ పాత్రని కామెడీ యాంగిల్ లోనే చూడడం వల్ల తన పాత్రతో కథలో వచ్చిన సంఘర్షణ అంత ప్రభావంతంగా వుండదు. ఆ పాత్ర రాజీపడిపోతుందిలే అని ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. బ్రిటిష్ అమ్మాయి జెస్సికా గా మరియా డీసెంట్ నటన కనబరిచింది. ప్రేమ్ జీ సహా మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
తమన్ పాటల్లో బింబిలిక్కి, జెస్సికా పాటలు క్యాచిగా వున్నాయి. నేపధ్య సంగీతంలో మెరుపులు లేవు కానీ ఓకే అనిపిస్తుంది. మనోజ్ పరమ హంస విజువల్స్ రిచ్ గా వున్నాయి. కలర్ ఫుల్ గా సినిమాని ప్రజంట్ చేశారు. నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. అనుదీప్ మార్క్ డైలాగులు కొన్ని నవ్విస్తాయి. అయితే కేవలం డైలాగులు మీదే ఆధారపడిపోయాడు అనుదీప్. జాతిరత్నాలు ప్రేక్షకులని అంతగా నవ్వించడానికి కారణం సన్నివేశం నుంచి పుట్టే హాస్యమే. ప్రిన్స్ లో మాత్రం అలాంటి హాస్యం కొరవడింది. అమాయత్వం, పిల్ల తెంపరితనం తో పుట్టిన హాస్యం జాతిరత్నాల్లో చూసేశాం. తమిళ ఆడియన్స్ ప్రిన్స్ ఓ జాతిరత్నం కావొచ్చేమో కానీ ఇక్కడ మాత్రం ఓ పాత జోకే.
తెలుగు రేటింగ్: 2.5/5