టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆకర్ష్ అస్త్రాన్ని రాత్రికి రాత్రి ప్రయోగించారు. అంతే బీజేపీ నుంచి కట్టు తెగినట్లుగా నేతలు టీఆర్ఎస్లోకి వచ్చేస్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలు ఇలా కేసీఆర్ ఒక్క పిలుపుతో తిరిగి వస్తున్నారు. స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ ఇద్దరూ టీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు. వీరిద్దర్నీ ప్రత్యేకంగా కేసీఆర్ ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ పిలిచిందే తడవుగా వారు ఆ పార్టీలో చేరిపోతున్నారు.
అయితే ఈ ఆకర్ష్ ప్రారంభమేనని చాలా పెద్ద పెద్ద తలకాయలు టీఆర్ఎస్లో చేరబోతున్నాయన్న ప్రచారాన్ని టీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. ఓ ఎమ్మెల్యే కూడా వస్తారంటున్నారు. ఓ మాజీ ఎంపీతో పాటు మరికొంత మంది గతంలో కేసీఆర్తో సన్నిహితంగా ఉన్న వారికి ఫోన్లు చేస్తున్నారు. జరిగిందేదో జరిగిపోయింది.. ఇప్పుడు రాజకీయంగా కీలక పరిస్థితుల్లో ఉన్నామని కలసి నడుద్దామని కేసీఆర్ పిలుస్తున్నారు. దీంతో పాత టీఆర్ఎస్ నేతలంతా తిరిగి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆ పార్టీ నేతలు కూడా ఇంత కంటే కావాల్సిందేమున్నట్లుగా పోలోమని టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు.
టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నల్లాల ఓదెలు కూడా ఇటీవలే కేసీఆర్ను కలిసిన తర్వాత టీఆర్ఎస్లో చేరారు. బీజేపీ ఇటీవల మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను చేర్చుకుని .. హంగామా చేసింది. ఆయనతో పెద్ద ఎత్తున కేసీఆర్పై విమర్శలు గుప్పించింది. దానికి కౌంటర్ గా కేసీఆర్ రివర్స్ ఆకర్ష్ ప్రయోగించారు. ఫలితంగా బీజేపీ ఇప్పుడు ఎవరెవరు పార్టీ వీడుతారా ఉత్కంఠలో పడిపోయింది. ఇదే అదనుగా టీఆర్ఎస్ మైండ్ గేమ్ ప్రారంభించింది.ఫలానా వాళ్లు వస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో బీజేపీ టెన్షన్లో పడుతోంది.