ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విషయంలోనూ పారదర్శకంగా ఉండదు. ఏదో గూడు పుఠాణి చేస్తున్నట్లుగా వ్యవహారాలు నడుపుతూ ఉంటుంది. తాజాగా అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో దాదాపుగా ఆరు నెలల తర్వాత పిటిషన్ వేసింది. నిబంధనల ప్రకారం ఆ పిటిషన్ విచారణకు రావడానికి ఇంకా సమయం పడుతుంది. కానీ ఏపీ ప్రభుత్వం అధికారికంగా నేరుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాసింది. అర్జంట్‌గా విచారణ జరపాలని అందులో కోరింది.
అర్జంట్‌గా విచారణ జరపడానికి కొన్ని కారణాలు చెప్పింది.అందులో తాము కార్యాలయాలు తరలించలేకపోతున్నామన్నది ఒకటి. అసలు మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంది ప్రభుత్వం. అలాంటప్పుడు కార్యాలయాలు ఎలా తరలిస్తుందనేది సస్పెన్స్. అదంతా పోని.. అసలు అంత అర్జెన్సీ అయితే.. తీర్పు వచ్చిన ఆరు నెలల పాటు ఎందుకు ఉగ్గబట్టుకున్నరన్నది న్యాయవర్గాలకూ అంతుబట్టదు. అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాత్రం ఏపీ ప్రభుత్వం నుంచి విచారణ జరపాలని లేఖ వచ్చినందున వెంటనే స్పందించారు.
ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు లిస్టింగ్ చేయాలని ఆదేశించారు. నవంబర్ ఒకటో తేదీన ఈ పిటిషన్ విచారణకు వచ్చేలా రిజిస్ట్రి లిస్టింగ్ చేశారు. ఆ రోజున సీజేఐ బెంచ్ ఈ కేసును విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే అమరావతి రైతులు.. ఎలాంటి ఉత్తర్వులు అయినా ఇచ్చే ముందు తమ వాదన వినాలని కేవియట్ లుదాఖలుచేశారు. కాబట్టి ఆ రోజున విచారణలో అందరి వాదనలు వినే అవకాశం ఉంది. ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్.. వచ్చే నెల ఎనిమిదో తేదీన రిటైర్ అవుతున్నారు.