రాజధాని కోసం భూములిచ్చి రోడ్డున పడిన రైతులకు కనీసం పాదయాత్రకు అరసవిల్లి గుడికి వెళ్లే స్వేచ్చ కూడా లేకుండా పోయింది. ఆరు వందల మంది రైతులు మాత్రమే వెళ్లాలి.. నాలుగు వాహనాలకే అనుమతి అని హైకోర్టు చెప్పింది ఇలా బ్రేకింగ్ రాగానే.. అలా పాదయాత్రపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఇవాళ ఉదయమే వారి పాదయాత్ర ఎక్కడ రైతులు బస చేస్తున్న ఫంక్షన్ హాల్ దగ్గర వందల మంది పోలీసులు ప్రత్యక్షమయ్యారు. పాదయాత్ర ప్రారంభం కాకుండా అడ్డుకున్నారు. కోర్టు చెప్పినట్లుగా ఆరు వందల మంది రైతులకు మాత్రమే అనుమతిస్తామని.. ఐడీ కార్డులు చూపించి పాదయాత్రలో పాల్గొనాలని ఒత్తిడి చేశారు. మీడియా కవరేజీకి అనుమతించలేదు. మద్దతుగా వచ్చినవారిని బలవంతంగా పంపేశారు. దీంతో రైతులు కోర్టులో తేల్చుకుంటామని.. నాలుగు రోజుల పాటు పాదయాత్రను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు.
పాదయాత్ర ప్రారంభం నుంచి ప్రభుత్వం రైతులపై పగబట్టినట్లుగా వ్యవహరిస్తోంది. గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అయ్యే సరికి పార్టీ నాయకులతో పోటీ నిరసనలు చేయిస్తోంది. అంతేనా.. కాళ్లు విరగ్గొడతామని… ఉత్తరాంధ్రపై దండయాత్ర అని.. మరొకటి అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిస్తున్నారు. పాదయాత్ర ఆపాలని హెచ్చరికలు కూడా చేయిస్తున్నారు. రాజమండ్రితో పాటు తణుకు వంటి చోట్ల దాడులు జరిగాయి. రామచంద్రాపురంలో అయితే పోలీసులే దాడులు చేశారు. అదే్ సమయంలో హైకోర్టు పాదయాత్రపై ఆంక్షలు విధించింది. హైకోర్టు ఇలా ఆంక్షలు విధించిందని తెలియదనే పోలీసులు విరుచుకుపడ్డారు.
అసలు పోటీ పాదయాత్రలు చేయడానికి … దాడులు చేయడానికి ఏ పర్మిషన్లు అక్కర్లేదు. కానీ రైతులకు మాత్రం అన్ని రకాల అనుమతులు అవసరం. ఈ పరిస్థితులతో రైతులు కూడా మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. రాజధాని కోసం అని అందరి అంగీకారంతో భూములు ఇచ్చినవారు పడుతున్న బాధతలు పగవాడికి కూడా రాకూడదని భావిస్తున్నారు. రాజ్యం ఇంత దారుణంగా సొంత ప్రజల్ని రైతుల్ని.. హింసిస్తుందా అని అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి. కోర్టుకు నాలుగు రోజులు సెలవు. ఆ తర్వాత న్యాయస్థానం ఇచ్చే నిర్ణయాన్ని బట్టి పాదయాత్ర కొనసాగుతుందా.. ఆగుతుందా అనేది తేలుతుంది.