మొన్నామధ్య గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలు జరిగితే.. ట్రిపుల్ రైడింగ్ చేసినా.. ట్రాఫిక్ చలాన్లు వేయకుండా చేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆఫర్ ఇస్తే అందరూ ఎగతాళి చేశారు. కానీ బీజేపీలో బండి సంజయ్‌ను మించిన వారు ఉన్నారని తేలిపోయింది. దీపావళి సందర్భంగా వారం రోజుల పాటు ట్రిపుల్ కాదు.. ఒక్క బైక్ మీద ఐదుగురు వెళ్లినా.. హెల్మెట్ పెట్టుకోకపోయినా.. బైక్ రేసింగ్‌లకు పాల్పడినా.. ఇంకా చెప్పాలంటే సమస్త ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనకు పాల్పడినా ఎలాంటి చలాన్లు.. కేసులు పెట్టకుండా ఆఫర్ ప్రకటించేశారు.. ఎక్కడో కాదు. కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న గుజరాత్లో.
అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ ఆఫర్ ఉంటుందని గుజరాత్ హోంమంత్రి ప్రకటించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే యాక్సిడెంట్లు అయి జనం చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబులిటీ అనే ప్రశ్నలు వేస్తారు కాబట్టి…మంత్రి కాస్త తెలివిగా ఆదేశాలిచ్చారు. వాహనదారుల్ని పరిశీలిస్తూ.. నిబంధనల్ని ఉల్లంఘించకూడదని వారికి ట్రాఫిక్ పోలీసులు సూచించాలని ఆదేశించారు. బీజేపీ నేతలంటే.. ఆ మాత్రం స్టాండర్డ్స్ ఉండాలని .. సోషల్ మీడియాలో బాగానే సెటైర్లు పేలుతున్నాయి.
వీళ్ల విమర్శల సంగతేమో కానీ.. అసలు దీపావళి పండగకు.. ట్రాఫిక్స్ రూల్స్ పాటించవద్దని ప్రజలకు ఆఫర్ ఇవ్వడానికి సంబంధమేంటో సామాన్యులకు అర్థం కాక తల పీక్కుంటున్నారు. ఎన్నికల ఎడాదిలో రాజకీయ నేతలు ఎలాంటి ఆఫర్లనైనా ఇస్తారని సరి పెట్టుకుంటున్నారు. ఇదే గుజరాత్ మోడల్ అంటేనని.. దేశం మొత్తం అమలు చేస్తారేమో చూడాలని మరికొంత మంది సెటైర్లు వేస్తున్నారు. అయినా… బీజేపీ అంటేనే అది.. అతి!