వాళ్లు కోవర్టులని ముందే తెలుసు. పార్టీలో ఉండి.. పార్టీని నాశనం చేస్తున్నారని తెలుసు. అయినా వారిపై చర్యలు తీసుకోలేక కాంగ్రెస్ నిస్సహాయంగా ఉండిపోయింది. ఇలాంటి స్థితి ఆ బ్రదర్స్ ఇద్దరూ పక్కాగా ఉపయోగించుకుని .. రాజకీయంగా ఎదిగిన పార్టీని నిలువునా కూల్చేస్తున్నారు. 2018 ముందస్తు ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ బ్రదర్స్ రాజకీయం ప్రారంభణయింది. ఎన్నికలైపోగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేసి బీజేపీలో చేరిపోవడానికి ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపారు. చేరిపోతున్నా అని ప్రకటించి ఆగారు. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి అనేక సార్లు తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షోకాజ్ నోటీసులు ఇచ్చారు కానీ.. కనీసం చర్యలు తీసుకోలేకపోయారు.
సోదరుడు రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎప్పుడూ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించని వెంకట్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. నిజానికి పీసీసీ చీఫ్ పదవిలో ఎవరు ఉన్నా… సోదరులిద్దరూ అసంతృప్తిగానే ఉంటారు. పొన్నాల లక్ష్మయ్య ఆ పదవిలో ఉన్నప్పుడు దండయాత్ర చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడూ అదే పరిస్థితి. తమకే పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే రేవంత్ రెడ్డికి చాన్సివ్వడంతో కోమటిరెడ్డి.. మాణిగం ఠాగూర్ క్యారెక్టర్ పైనే ఆరోపణలు చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోలేదు. దీంతో కోమటిరెడ్డి సోదరులు లైసెన్స్ వచ్చినట్లుగా ఫీలయ్యారు. ఇప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన నేత. కాంగ్రెస్ పార్టీ వల్లే ఆయన కుటుంబం అపర కుబేరులయ్యారని అందరికీ తెలుసు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డిదే ఆధిపత్యం. ఆయన చనిపోయాక.. తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అధికారం పోయిన తర్వాత మరింతగా మారిపోయింది. పార్టీలో ఉంటూ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని తెలిసినా.. ఏ మాత్రం చర్యలు తీసుకోలేని నిస్సహాయత వల్లే కాంగ్రెస్ నిర్వీర్యం అయిపోతోంది.