కర్నూలులో న్యాయరాజధాని పెడతామని దాన్ని అడ్డుకుంటున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాయలసీమ మొత్తం ర్యాలీలు, దర్నాలు, జేఏసీల గర్జనలు నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. భూమన కరుణాకర్ రెడ్డి ఈ విషయంలో ముందున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారేమోనన్న భయంతో ఉన్న ఆయన.. ఇటీవల కాపుల్ని పవన్ కించ పరిచారంటూ ఓ ర్యాలీ చేశారు. వచ్చే ఎన్నికల్లో కుమారుడ్ని నిలబెట్టి ఎలాగైనా గెలిపించాలనుకుంటున్న ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు నవ్వుకునేలా చేస్తున్నాయి. మూడు రాజధానులకు కూడా మద్దతు అంటూ మొదట ఆయనే ర్యాలీ నిర్వహంచబోతున్నారు.
కర్నూలులో హైకోర్టు పెడితే.. రాయలసీమ మొత్తం అభివృద్ధి చెందిపోతుందని ఆయన చెప్పదల్చుకున్నట్లుగా ఉంది. కర్నూలులో పెడితే కడపకు.. చిత్తూరుకు.. అనంతపురానికి ఏమి వస్తుందో వైసీపీ నేతలు ఏం చెబుతారో కానీ…. వైసీపీ నేతలు మాత్రం ఎన్నికల్లో ఇంత కంటే చెప్పుకోవడానికి ఏమీ లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో మూడు రాజధానులకు మద్దతుగా చేస్తున్న గర్జనలు.. రౌండ్ టేబుల్ సమావేశాలన్నీ వైసీపీ నేతలతోనే సాగుతున్నాయి. ప్రజా స్పందన ఉండటం లేదు. దీంతో.. రాయలసీమలో అయినా సెంటిమెంట్ పెంచాలనుకుంటున్నారు. అయితే ఇది రివర్స్ అయ్యే సూచనలే ఎక్కువ కనిపిస్తున్నాయి.
ఎక్కడో విశాఖలో రాజధాని పెట్టి.. వస్తుందో రాదో తెలియని ప్రభుత్వం చేతుల్లో లేని హైకోర్టు పెడతమని ఎలా మభ్యపెడతారన్నది ప్రజల ప్రశ్న. అదే సమయంలో కోస్తాలోనూ సెంటిమెంట్ రేగితే.. మొత్తానికే మోసం వస్తుంది. అయితే కోస్తాలోనూ మూడు రాజధానులకే మద్దతు అని పార్టీ నేతలతో ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యే చాన్స్ ఉంది. కానీ ప్రజల్లో సెంటిమెంట్ పెరిగేతే.. వైసీపీ నేతలు చేసే ర్యాలీలతో ప్రయోజనం ఉంటుందని . ..ఆ పార్టీ నేతల్లోనే ఆందోళన వ్యక్త.మవుతోంది.