ఏపీ మహిళా కమిషన్ పేరుతో పవన్ కల్యాణ్‌కు జారీ అయినట్లుగా చెబుతున్న నోటీసులు అసలు నోటీసులు కాదన్న వాదన వినిపిస్తోంది. కేవలం రాజకీయ ఆరోపణలు చేయడానికి ..నిందలు వేయడానికి మహిళా కమిషన్ లెటర్ ప్యాడ్‌ను వాడుకున్నారన్న అభిప్రాయం న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కేవలం లెటర్ ప్యాడ్ మీద చేయాల్సిన ఆరోపణలు చేశారు కానీ.. అవి ఏ విధంగా చట్ట విరుద్ధమో ఒక్క కారణం కూడా లేదు. సాధారణంగా నోటీసులంటే ఓ పద్దతి ఉంటుంది. ఎప్పట్లోపు సమాధానం ఇవ్వాలో ఉంటుంది. ఎప్పుడు తమ ఎదుట హాజరు కావాలో చెబుతారు. కానీ వాసిరెడ్డి పద్మ పవన్‌కు జారీ చేసినట్లుగా చెబుతున్న వాటిలో అలాంటివేమీ లేవు.
తాను అన్న మాటలకు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ మాత్రమే ఉంది. అదే సమయంలో వాసిరెడ్డి పద్మ పవన్ కల్యాణ్ అన్న మాటలు మహిళా భద్రతకు పెను ప్రమాదం అని వీడియో విడుదల చేశారు. ఎలా ప్రమాదమో చెప్పలేదు. పవన్ మాటలు విని అందరూ మూడు పెళ్లిళ్లు చేసుకుంటారన్నట్లుగా ఆమె తీర్మానించేస్తున్నారు. వాసిరెడ్డి పద్మ మహిళ కమిషన్ చైర్పర్సన్ పదవిలో ఉండి పూర్తిగా రాజకీయం చేస్తున్నారని తీర్మానించుకున్న జనసేన ..ఆమెను రాజకీయంగానే టార్గెట్ చేయడం ప్రారంభించారు.
జనసేన పార్టీ వైసీపీ నతేలు… ఇతరులు మహిళలపై ఆకృత్యాలకు పాల్పడినా.. చర్యలు తీసుకోని కేసులన్నింటినీ సోషల్ మీడియాలో గుర్తు చేస్తూ పోస్టులు పెట్టారు. అప్పుడు ఎందుకు .. ఎవరికీ నోటీసులు జారీ చేయలేదని జనసేన ప్రశ్నించింది. ఇవి వైరల్ అయ్యాయి. మొత్తంగా మహిళా కమిషన్ పేరుతో మహిళల భద్రత కాకుండా కేవలం రాజకీయాలు చేస్తున్నారన్న విషయాన్న జనసేన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది.