వైసీపీకి పరోక్ష సహకారం అందించి ఆ పార్టీకి ఎంతో కొంత మేలు చేయాలని… జనసేన పార్టీని టీడీపీతో కూడా కలవకుండా చేయాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ బృందంపై సొంత పార్టీలోనే తిరుగుబాటు కనిపిస్తోంది. సోము వీర్రాజు, సునీల్ ధియోధర్, జీవీఎల్ నరసింహారావు ముగ్గురూ టీడీపీతో పొత్తు పెట్టుకోబోమని సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతున్నారు. వంతుల వారీగా అయినా దాదాపుగా వీరి స్టేట్మెంట్లు ఉంటున్నాయి. టీడీపీ పొత్తు పెట్టుకోవాలని ఎప్పుడు ఆహ్వానించిందని ప్రశ్నలు వస్తున్నా వారు తగ్గడం లేదు.
వీరి ప్రకటనలపై బీజేపీలోనే అసహనం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించి.. వైసీపీతో వీలైనంత దూరంగా ఉండాలనుకుంటున్న నేతలు.. టీడీపీతో పొత్తు వల్ల ప్రయోజనం ఉంటుందనుకున్న నేతలు ఈ వాదనలు చేస్తున్నారు. వైసీపీని ఓడించాలంటే టీడీపీ, బీజేపీ, జనసేన కలవాలని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. ప్రజలు ఏమీ అనుకుంటున్నారో సునీల్ ధియోధర్ తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. విష్ణుకు మద్దతుగా ఇతరులు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.
నిజానికి పొత్తులపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని బీజేపీ హైకమాండ్ చెప్పింది. అయితే సునీల్ ధియోధర్ మాత్రం.. మాటకంటే ముందు టీడీపీతో పొత్తు అంశాన్ని తెరపైకి తెచ్చి ఖండిస్తూ ఉంటారు. జనసేన పార్టీ.. టీడీపీతో పొత్తుకు సిద్ధమమయింది. బీజేపీతో కలసి నడవడానికి సిద్ధంగా లేదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి వ్యూహం మార్చుకుంటున్నానని ఆయన ప్రకటించారు కూడా. అయినా బీజేపీ నేతలు… జనసేనతోనే కలిసి పోటీ చేస్తామని ప్రకటిస్తూ..ఉద్దేశపూర్వక గందరగోళం సృష్టించి.. వైసీపీ నేతలకు కాస్త భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.