గవర్నర్లు అందరికీ ఒకటే. అందరికీ అధికారాలు ఒకటే ఉంటాయి. కానీ వారు వ్యవహరించే విధానం మాత్రం బీజేపీ, మిత్రపక్షాల రాష్ట్రాలు.. బీజేపీయేతర రాష్ట్రాలలో వేర్వేరుగా ఉంటుంది. దీనికి తాజాగా ఉదాహరణ.. కేరళ గవర్నర్. కేరళలో కమ్యూనిస్టు కూటమి ప్రభుత్వం ఉంది. అక్కడ గవర్నర్‌గా అరిఫ్ మహమ్మద్ ఖాన్ ఉన్నారు. ఆయన హఠాత్తుగా కేరళలో ఉన్న అన్ని యూనివర్శిటీల వీసీలను రాజీనామా చేయాలని ఆదేశించారు. దీంతో అక్కడి ప్రభుత్వం మండిపడింది.
వీసీలను లాంఛనంగా నియమించే అధికారం ఉంది కానీ.. రాజీనామా చేయమనే అధికారం గవర్నర్‌కు ఎక్కడిదని ప్రశ్నించింది. దానికి తగ్గట్లుగానే వీసీలెవరూ రాజీనామా చేయలేదు. ఆ గవర్నర్ కేంద్రం చెప్పినట్లుగా వింటూ.. బీజేపీ ఎజెండాను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని కమ్యూనిస్టు ప్రభుత్వం మండి పడింది. సీఎం పినరయి విజయన్ గవర్నర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పార్టీ గవర్నర్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగింది.
అదే సమయంలో ఏపీ గవర్నర్ మాత్రం వీసీల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు పట్టించుకోరు. తీవ్రమైన ఆరోపణలు ఉన్నా… పూర్తి స్థాయి.. రాజకీయ , కుల వివాదాలు ఉన్న వీసీలను సైతం నియమించేశారు. విశాఖలో ఏయూ ప్రసాదరెడ్డి అనే వీసీ.. వైసీపీ కార్యకర్తలా .. క్యాంప్‌ను పార్టీ ఆఫీస్‌గా మార్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. నాగార్జున యూనివర్శిటీ వైస్ చాన్సలర్ అయితే.. విద్యార్థులతో జగనన్న పాటలు పెట్టి డాన్సులేపిస్తూ ఉంటారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రుజువైనా.. ఈ ప్రభుత్వం మరో కమిటీని నియమించి మరీ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. దాదాపు అన్ని యూనివర్శీటీలదీ అదే పరిస్ధితి. 70శాతం యూనివర్శిటీలకు వీసీలుగా ఒకే సామాజికవర్గం వారిని పెట్టినా… పట్టించుకోలేదు. కానీ కేరళలో మాత్రం కారణం లేకుండానే రాజీనామాకు ఆదేశించారు.