ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌పై కోడి కత్తి దాడి జరిగి ఇవాళ్టికి నాలుగేళ్లయింది. అప్పట్లో జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నారు. ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరవ్వాల్సి ఉండేది. అందుకే ప్రతి గురువారం మధ్యాహ్నం కల్లా ఆయన పాదాయత్ర నిలిపివేసి.. వెంటనే విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ బయలుదేరేవారు. ఇలా ప్రతీ వారం వస్తూండే సరికి.,..ఎయిర్ పోర్టు క్యాంటీన్లో పని చేసే శ్రీను అనే వ్యక్తి.. వీఐపీ లాంజ్‌లోకి వెళ్లడానికి అవకాశం దొరకబుచ్చుకున్నాడు. టీ, కాఫీలు అందించే ఉద్దేశంతో వెళ్లాడు. చిన్న కోడికత్తితో దాడి చేశాడు. చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు.
కానీ హైదరాబాద్ చేరుకున్న తరవాత ప్రస్తుతం లోటస్ పాండ్‌కు దగ్గరగా ఉన్న సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. ఆ ఆస్పత్రి వైద్యులు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. మూడు వారాల వరకూ రెస్ట్ తీసుకున్నారు. ఇది పెద్ద సంచలనం అయింది. శీను జగన్ అభిమాని అని.. జగన్ పై సానుభూతి రావడం కోసం చేశారని పోలీసులు తేల్చారు. అయితే వైసీపీ నేతలు అప్పట్లో బీజేపీతో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని ఏకంగా ఎన్ఐఏ విచారణకు తెచ్చుకున్నారు. ఆ కేసుని చేతుల్లోకి తీసుకున్న ఎన్ఐఏ.. కోడికత్తి శీనును జైలుకు పంపి.. కాస్త విచారణ జరిపి.. నిజమేంటో తేల్చకుండా అలా వదిలేసింది.
నిజానికి ఎన్ఐఏకు అన్ని రకాల వనరులు అందుబాటులో ఉంటాయి. ఈ కేసులో నిజమేంటో ఈ పాటికి ఎన్ఐఏ గుర్తించే ఉంటుంది. కానీ చార్జిషీటు దాఖలు చేయలేదు. నిందితుడైన శీను జైల్లోనే ఉండిపోయారు. ఆ కేసు రాష్ట్ర పోలీసుల దగ్గర ఉంటే ఆయన ఎప్పుడో రిలీజయి ఉండేవారు. కానీ ఎన్ఐఏ కేసు కావడంతో బెయిల్ రావడం లేదు. శీను తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు. ఏదో ఒకటి చేసి బెయిల్ ఇప్పించాలని జగన్ ను కోరుతున్నారు. కానీ జగన్ మాత్రం వారిని కలిసేందుకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. అందుకే సీఎం ఇంటి ఎదుట ధర్నా చేస్తామని వారంటున్నారు. ఏదైనా కానీ.. ఓ ప్రతిపక్షనేత.. ఇప్పటి సీఎంపై దాడి కేసును అలా ఎందుకు ఉంచేస్తున్నారో … ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో వారికే తెలియాలి.