ఏపీలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని.. తీవ్రమైన విమర్శలు వచ్చినప్పుడు మరో జిల్లా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ముఖ్యంగా… పోలవరం ముంపు ప్రాంతాల గిరిజనలుక ప్రభుత్వం అతి పెద్ద కష్టం తెచ్చి పెట్టింది. రంపచోడవరం నియోజకవర్గంలో రంపచోడవరం, రాజవొమ్మంగి, దేవీపట్నం, చింతూరు, అడ్డతీగల, వైరామవరం, మారేడుమిల్లి, కూనవరం, వీఆర్ పురం, నెల్లిపాక, గంగవరం మండలాలున్నాయి. అలాగే రంపచోడవరం, చింతూరు ఐటీడీఏలు కూడా ఉన్నాయి. ఆయా మండలాలకు రోడ్డు కనెక్టివిటీ కూడా తక్కువే. వీరంతా ఏదైనా అవసరాల నిమిత్తం దూరమైనా రాజమహేంద్రవరం వెళ్తుంటారు. ఇప్పుడు వీరిని పాడేరు లోకి మార్చడంతో పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రయాణించడం ఇబ్బంది.
బస్సు కనెక్టివిటీ కూడా తక్కువ. జిల్లా కేంద్రానికి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం కొత్త జిల్లాల నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడే రంపచోడవరంను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్లు వచ్చాయి. కానీ ప్రభుత్వం అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అప్పటికే రెండు జిల్లాలుగా విభజించడంతో అది కుదర్లేదు. ఐతే రంపచోడవరం, పాడేరు పూర్తిగా కొండ ప్రాంతాల్లో ఉంటాయి. ఇక్కడి నుంచి ఏదైనా పని నిమిత్తం పాడేరు వెళ్లాలంటే సరైన రోడ్డు సౌకర్యం లేదు. పైగా మారుమూల ప్రాంతాల నుంచి సాధారణ రోడ్లపైకి రావడానికే అక్కడి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఒక రోజు పూర్తిగా ప్రయాణించాల్సి ఉంటుంది.
ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 27వ జిల్లాగా రంపచోడవరంను ప్రకటిస్తామని అప్పటి మంత్రి పేర్ని నాని చెప్పారు.కానీ ఇప్పుడు కొత్తగా రంపచోడవరంలోని నాలుగు మండలాలతో చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. దీంతో కొత్త జిల్లా ఏర్పాటు లేనట్లేనని భావిస్తున్నారు. రెవిన్యూ డివిజన్తోనే గిరిజనుల సమస్యలు పరిష్కారం కావని… పోలవరం నిర్వాసితులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ప్రజలకు దగ్గరగా జిల్లా కేంద్రం ఉండాలన్న వాదన వినిపిస్తోంది. కానీ ప్రభుత్వం మనసు మార్చుకుంది.