దీపావళి సందర్భంగా పండగ చేసుకోమని 75వేల మందికి నియామకపత్రాలు ఇచ్చారు మోదీ. దీని కోసం విస్తృత ప్రచారం చేశారు. కొన్నాళ్ల కిందట.. కేంద్ర ప్రభుత్వ రంగంలో ఖాలీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారు. అందులో భాగంగా 75వేల నియామకాలు చేశారు. ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చారో.. ఎలా భర్తీ చేశారో తెలియదు కానీ.. నియామకపత్రాలిచ్చారు. మిగతా ఉద్యోగాల భర్తీ జరుగుతోందన్నారు. అయితే ఈ భర్తీపై తెలంగాణ మంత్రి , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండిపడ్డారు. పెద్ద డ్రామాలాడుతున్నారని భారీ లేఖ రాశారు.
ఉత్తుత్తి ఉద్యోగాలిస్తున్నారని.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీ ఏమైందని లేఖలో ప్రశ్నించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. లేఖలో కేటీఆర్ చాలా ఆవేశం ప్రదర్శించారు. అయితే అందులోనే తాము లక్షల సంఖ్యలో ఉద్యోగాలిచ్చామని చెప్పుకున్నారు. ఓ చిన్న రాష్ట్రామే లక్షల్లో ఉద్యోగాలిస్తే కేంద్రం ఎందుకు ఇవ్వదని ఆయన వాదించారు. ఆయన లేఖ తెలంగాణ నిరుద్యోగుల్లోనూ విస్తృతంగా చర్చకు వచ్చే చాన్స్ ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క గ్రూప్స్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఆరేడు నెలల కిందట 80వేల ఉద్యోగాల భర్తీ ప్రకటించారు. వాటిప్రక్రియ మెల్లగా సాగుతోంది.
మోదీఅయినా ఒక్క సారిగా 75వేల ఉద్యోగాల నియామకపత్రాలిచ్చారు. కానీ తెలంగాణలో ఇంకా నియామక ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఎన్నికల వరకూ ఈ ఉద్యోగ నియామకాలు చేస్తారన్న విమర్శలు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ విషయంలో కేంద్రాన్ని నిందించాలనుకుంటే ముందుగా అందరి చూపు.. తెలంగాణ సర్కార్ వైపే ఉంటుంది. కానీకేటీఆర్ మాత్రం అలా అనుకోవడం లేదు. ఉద్యోగాల భర్తీలో తామే ది బెస్ట్ అనుకుంటున్నారు.