పీఆర్సీ ఇస్తే జీతాలు పెరుగుతాయి కానీ తగ్గుతాయా? . ఏపీలో మాత్రం తగ్గుతాయి. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇది అవగతమైంది. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు తెలుస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులకు ఇటీవల పీఆర్సీ అమలు చేశారు. దీంతో జీతం పెరుగుతుందేమో అనుకున్నారు. కానీ జీతం ఐదు నుంచి పదివేల రూపాయల వరకూ తగ్గి వస్తోంది. ఎందుకంటే.. ఆర్టీసీ ఉద్యోగులకు ఉండే వివిధ రకాల అలవెన్స్‌లు తీసేశారు.
ఆర్టీసీ ఉద్యోగులకు వివిధ రకాల అలవెన్స్‌లు ఉంటాయి. అదనపు సమయం పని చేయడం, డే డ్యూటీ, నైట్ డ్యూటీ అలవెన్స్ ఇలా వారు వేళాపాళా లేకుండా.. సమయం .. సందర్భం లేకుండా పని చేసినందుకు అలవెన్స్‌లు ఉండేవి. వీటిని ప్రభుత్వం తీసేసింది. వాటిని తీసేసి.. పీఆర్సీ కలిపింది. పీఆర్సీతో పెంచామని చెబుతున్నారు కానీ.. అలవెన్స్‌లు కోసేశామని చెప్పడం లేదు. గత నెలలో ఇలాగే చేస్తే ఉద్యోగులు ఎక్కడ సమ్మె చేస్తారోనన్న భయంతో వచ్చే నెల ఇస్తామని చెప్పారు.. ఈ నెల కూడా ఇచ్చే అవకాశం లేదని ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు మండిపడుతున్నారు.
అయితే ప్రభుత్వ వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. మీరిప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు… ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీలో ఉండే .. అలవెన్స్ లు ఉండవు. ఇవ్వరు. అందుకే కత్తిరించేశాం అని పరోక్షంగా చెబుతున్నారు. అయితే వాటిని మళ్లీ ఇస్తామని చెబుతున్నారు. ఎలా ఇస్తారో.. ఎప్పుడిస్తారో చెప్పడం లేదు. ఇస్తారో లేదో కూడా తెలియదు. ఇదేం ఫిట్టింగ్ మహా ప్రభో అని ఆర్టీసీ ఉద్యోగులు కిందా మీదా పడుతున్నారు. అయితే ఇలాంటి గేమ్‌లో ఆరితేరిపోయిన ప్రభుత్వం… ఉద్యోగులతో బతిమాలించుకుని చివరికి ఇస్తుందని.. పాలాభిషేకాలు చేయించుకుంటుందని కొంత మంది ఉద్యోగ నేతలు నమ్ముతున్నారు.