అది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు. అక్కడ బీజేపీకి కనీస ఓటు బ్యాంక్ లేదు. అచ్చంగా నాగార్జున సాగర్ లాంటి పరిస్థితే. కానీ అక్కడ బీజేపీకి డిపాజిట్ రాలేదు. కానీ మునుగోడులో మాత్రం గట్టి పోటీ ఇస్తోంది. దీనికి కారణం.. టీఆర్ఎస్ తన ప్రత్యర్థిగా బీజేపీని ఎంచుకోవడమే కాదు.. రెండు పార్టీల ధన బలం విరుచుకుపడటం కూడా. ఆర్థిక సమస్యలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇబ్బంది పడుతున్నారు. ప్రచారమైతే జోరుగా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా శక్తికి మించి కష్టపడుతున్నారు. ఓ వైపు రాహుల్ యాత్ర .. మరో వైపు మునుగోడు వ్యూహాలనూ పన్నుతున్నారు.
మునుగోడు ప్రజల్లో కాంగ్రెస్ పట్ల అభిమానం ఉన్నదని… అయితే టీఆర్ఎస్, బీజేపీల డబ్బుల ప్రవాహంలో కొట్టుకుపోతుందని గ్రహించిన రేవంత్ రెడ్డి.. కన్నీరు పెట్టుకుని .. సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారు. అది ఎంత వర్కవుట్ అవుతుందనేది చెప్పలేం కానీ.. బీజేపీ, టీఆర్ఎస్ మదగజాల్లా ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. రూ. కోట్లను మంచి నీళ్లలా ఖర్చు చేసేస్తున్నాయి. వాటితో కాంగ్రెస్ పోటీ పడలేకపోతోంది. మునుగోడులో గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్‌పై నమ్మకం కలుగుతుంది. లేకపోతే కష్టం.
తమ పార్టీని వ్యూహాత్మకంగానే టీఆర్ఎస్, బీజేపీ తొక్కేస్తున్నాయని రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. అందులో డౌటే లేదు. అయితే టీఆర్ఎస్కు కూడా ఇప్పుడు బీజేపీలో పోరాడటం తప్ప వేరే చాయిస్ ఉండటం లేదు. కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థిగా ఎంచుకునేందుకు కూడా అవకాశాలు తగ్గిపోయాయి. అంతగా బీజేపీ ఎదిగింది. అందుకే కాంగ్రెస్ కు ఈ గడ్డు పరిస్థితి . అయితే చివరి బాల్ వరకూ ఆడాలన్న కసితో ఉన్న రేవంత్ తన ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఏదీ ముందుగా అంచనా వేయలేం . చివరి క్షణం వరకూ ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే కాంగ్రెస్.. వెనుకబడిపోయిందని కూడా అంచనా వేయలేం.