మారుతున్న రాజకీయ పరిస్థితులు వైసీపీకి దిక్కు తోచకుండా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. పరిపాలన చేస్తూ.. ప్రతిపక్షంలాగా వ్యవహరిస్తున్నారు. మూడు రాజధానుల కోసం అంటూ గర్జన పెడుతూ.. తాజాగా బీసీల మధ్య చిచ్చు పెట్టేలా .. రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేయండి అంటూ.. బీసీ నేతలతో విజయసాయిరెడ్డి సమావేశం నిర్వహించారు. చివరికి వైసీపీలో బలమైన బీసీ నేతే లేనట్లుగా… విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఈ బీసీ నేతల మీటింగ్ జరిగింది. ఐ ప్యాక్ సహకారంతో.. జగన్ ఆదేశాలతో ఈ మీటింగ్ పెట్టామని చెప్పుకున్న విజయసాయిరెడ్డి.. బీసీ నేతలందరికీ.. జనాభా ప్రాతిపదికన రిజర్వేలు అడగాలని వారందరికీ సలహా ఇచ్చారు. సాయిరెడ్డి సలహా విని ఆ పార్టీ నేతలు ఆశ్చర్యపోయారు.
కాపు రిజర్వేషన్లను జగన్ సీఎం అయ్యాక తొలగించారు. కేంద్రం ఈడబ్ల్యూఎస్ కోటా కింద పదిశాతం రిజర్వేషన్లు ఇస్తే వాటిలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల చట్టపరమైన లాంఛనాలు పూర్తయ్యాయి. సర్టిఫికెట్ల జారీనే మిగిలింది. అయితే జగన్ అధికారంలోకి రాగానే ఆ రిజర్వేషన్లు ఎత్తేశారు. దీంతో కాపులకు అంది వచ్చిన రిజర్వేషన్ ఫలం.. నోటి దగ్గరనుంచి లాక్కున్నట్లయింది. ఈ అంశం ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నారేమో కానీ హఠాత్తుగా బీసీ నేతల్ని దగ్గరకు చేర్చుకుని రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేయమని సలహాలిచ్చారు.
ఎస్సి ఎస్టీ లకు రిజర్వేషన్లను రాజ్యాంగం ఇచ్చిందని..జనాభా ప్రాతిపదికన బిసి లు రిజర్వేషన్లు అడగాలని విజయసాయిరెడ్డి హితబోధ చేశారు. కొన్ని వర్గాలను ఎస్సి ఎస్టీ లో కలపాలని కోరితే సాధ్యం కాదు…ఏ ఒక్క సామాజిక వర్గానికి అన్యాయం జరగకుండా రిజర్వేషన్లు ఉండాలని నతులు చెప్పుకొచ్చారు. 225 మంది ప్రజా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారని.. మరో పది రోజుల్లో స్థానిక బిసి ప్రజా ప్రతినిధులు తో మరో సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. 26 జిల్లాలలో కూడా బిసి ల సమస్యల పరిష్కారం కోసం సమావేశాలు ఉంటాయయన్నారు. పరిపాలన చేస్తూ.. ఇలా కులాల వారీగా డి్మాండ్లను విపక్షం తరహాలో హైలెట్ చేసుకోవడం.. పరిష్కరిస్తామని చెబుతూండటం… ఏమిటని వైసీపీ నేతలే గొణుక్కుంటున్నారు.