తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపుగా నిర్మాణం పూర్తయింది. మూడున్నరేళ్లకు తుది మెరుగులు దిద్దారు. సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. అయితే ఇలా ప్రారంభించబోతోన్నది ఎందుకంటే ..ప్రైవేటుకు అప్పగించడానికి. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో నిర్మించిన విద్యుత్ ప్రాజెక్ట్ మూడో దశ గురించే ఇదంతా. కృష్ణపట్నం పవర్ ప్లాంట్‌ను 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించించారు. ఒక్కో యూనిట్ 800 మెగావాల్ట్ సామర్థ్యంలో మూడు యూనిట్లను నిర్మించారు. ప్రస్తుతం రెండు యూనిట్లు పనిచేస్తున్నాయి.
మూడో యూనిట్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న ప్రారంభించనున్నారు. ఇప్పటికే రన్నింగ్‌లో ఉన్న ఒక ప్రాజెక్టులో 500 యూనిట్లు, మరో ప్రాజెక్టులో 490 యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. లాభాల్లో నడుస్తోంది. అయితే, నష్టాలు వస్తున్న పేరుతో ఈ ప్రాజెక్టును ప్రైవేట్ వారికి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్)ను ప్రయివేటీకరించడానికి జగన్ సర్కార్ బిడ్లను ఆహ్వానించింది. బిడ్లు వేయడానికి 21 రోజులు గడువు ఇచ్చింది. నవంబర్ చివరికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రయివేటు వ్యక్తుల చేతిలో పెట్టనున్నారు. రూ.20 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును ప్రయివేటు వ్యక్తులకు 25 ఏళ్లు లీజుకు ఇవ్వాలని ఈ ఏడాది జనవరి 21న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టెండర్ల ప్రక్రియ అంతా అపహాస్యమేనని.. అదానీ కంపెనీలే ఈ కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్‌ను తీసుకోబోతున్నాయని ఇప్పటికే స్పష్టమయింది.
కృష్ణపట్నంలోని ఎపి జెన్కోకు ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు. బొగ్గును విదేశాల నుంచి అధిక ధరలకు బొగ్గు దిగుమతి చేసుకోవాల్సి రావడంతో ఎపి జెన్కోలో ఒక్క యూనిట్ విద్యుదుత్పత్తికి రూ.3.90 ఖర్చు చేయాల్సి వస్తోంది. బొగ్గు దిగుమతులు, ఇతర అంశాల్లో ప్రాజెక్టులకు నష్టాలు వస్తున్నాయని యాజమాన్యం చెబుతూ వస్తోంది. ఈ ప్రాజెక్టులో 27 శాతం వాటా తెలంగాణ ప్రభుత్వానిది. ప్రైవేటీకరణను ఆ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇటీవల కృష్ణపట్నం పోర్టును అదానీకి కట్టబెట్టింది.