నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని కొనేందుకు బేరసారాలు చేస్తూ బీజేపీ అడ్డంగా దొరికిపోయింది. మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో సతీష్ శర్మ అలియాస్ రామచంద్రభారతి , సింహయాజులు అనే స్వామిజీలతో పాటు హైదరాబాద్‌కు చెందిన నందకుమార్ అనే వ్యక్తి కలిసి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరాలు ఆడుతున్నారు. ఈ సమాచారం పోలీసులకు అందడంతో పెద్ద ఎత్తున బలగాలతో ఎటూ తప్పించుకుపోకుండా చేసి రెయిడ్ చేశారు. దీంతో అందరూ దొరికిపోయారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎంత స్వాధీనం చేసుకున్నారన్నది పోలీసులు ఇంకా బయట పెట్టలేదు.
కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షనర్ధన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు ఫామ్ హౌస్‌లో వీరితో మాట్లాడుతూండగా పోలీసులు దాడి చేశారు. డబ్బులతో పట్టుబడిన నందకుమార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడని చెబుతున్నారు. ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి.. ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపినట్లుగా చెబుతున్నారు. పార్టీఫిరాయిస్తే పదవులు, డబ్బులు ఇస్తామని ప్రలోభపెట్టారని పోలీసులు ప్రకటించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఈ సమాచారం ఇచ్చారని .. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు.
చట్టపరమైన చర్యలు తీసుకుటామన్నారు. రామచంద్రభారతి ఫరీదాబాద్ టెంపుల్లో ఉంటారని.. తిరుపతి నుంచి కూడా ఓ స్వామిజీ వచ్చారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. వీరంతా ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపారన్నారు. ఏమని ప్రలోభ పెట్టారన్న దానిపై విచారణ జరుపుతున్నామన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు కనీసం వంద కోట్ల డబ్బులు ఇస్తామని.. కాంట్రాక్టులు.. పదవులు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారని కమిషనర్ ప్రకటించారు.