రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ట్రాప్ ఎలా వేశారో పది కెమెరాలతో సహా నిక్షిప్తమయింది. అంత అమాయకంగా రేవంత్ రెడ్డి ఎలా చిక్కారా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఫామ్ హౌస్‌లో నలుగురు ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయింపునకు బేరసారాలు అంటూ బయటపడిన ట్రాప్ వ్యవహారం కూడా సేమ్ టు సేమ్ అన్నట్లుగా కనిపిస్తోంది. కానీ ఇక్కడ బాధితులెవరు ? కుట్రదారులెవరు ? అన్నది మాత్రం స్పష్టత లేకుండా పోయింది.
నలుగురు ఎమ్మల్యేలు బేరానికే వచ్చారా ?
అది టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫాం హౌస్. అక్కడకు మరో ముగ్గురు సహచర ఎమ్మెల్యేలు వచ్చారు. కలిసి మాట్లాడుకున్నారు. వారితోపాటు ఇద్దరు స్వామిజీలు.. నందకుమార్ అనే మరో వ్యాపారవేత్త ఉన్నారు. ఇంతలో పోలీసులు వచ్చారు. వెంటనే మీడియాలో పెద్ద ఎత్తున బ్రేకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేల బేరసారాలకు పెద్ద కుట్ర అని వేయడం ప్రారంభిచారు. ఆ మీడియా చానళ్లే రూ. వంద కోట్ల బేరం అని చెప్పాయి. తర్వాత కావాల్సినంత డ్రామా నడిచింది. కానీ ఆ డబ్బులేవీ కనిపించలేదు. కారులో ఉన్న బ్యాగులు చూపించి అందులో రూ. కోట్లున్నాయన్నారు. అక్కడ జరిగింది అదే తప్ప.. అక్కడ బేరాలు.. నేరాలు.. ఘోరాల సీనే కనిపించలేదు.
నలుగుర్ని ట్రాప్ చేశారా ?
ఎలాగైనా ఎమ్మెల్యేల్ని ఆకర్షించాలన్న లక్ష్యంతో మధ్యవర్తుల ద్వారా చేసిన ప్రయత్నాలు .. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో బెడిసి కొట్టిందనే అభిప్రాయం వినిపిస్తోంది. గతంలో జరిగిన వాటిని మర్చిపోయి నిర్లక్ష్యంగా డీల్ చేయడంతో ప్రభుత్వానికి ఇంటలిజెన్స్‌కు దొరికిపోయారని అంటున్నారు. ఇలాంటి విషయాలను కేసీఆర్ ఎలా డీల్ చేస్తారో… రేవంత్ విషయంలోనే తేలిపోయింది. అచ్చంగా అదే ప్లాట్‌ను అమలు చేశారని అనుకోవచ్చు. నలుగురు ఎమ్మెల్యేలు తమ వాళ్లు కాబట్టి బయటపడకుండా చివరికి వరకూ కథ నడిపించారని అంటున్నారు.
ఇంత నిందను ఎమ్మెల్యేలు మోస్తారా ?
తమకు వచ్చిన ఆఫర్ గురించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకమాండ్‌కు చెప్పి ఉంటారని.. వారి ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టించారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఎపిసోడ్‌లో మధ్యవర్తులు..బేరసారాలు ఆడేవారు ప్రముఖులు కాదు. వారి వెనుక ఎవరున్నారో చెప్పడం కష్టం. కానీ ఫామ్ హౌస్‌లో కనిపించిన నలుగురు ఎమ్మెల్యేలపై మరక మాత్రం పడిపోతుంది. బీరం హర్షవర్థన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు రూ. వంద కోట్లకు అమ్ముడుపోవడానికి రెడీ అయినట్లుగా ముద్రపడిపోయింది. ఈ బేరసారాల్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికే తాము వచ్చామని వారు తర్వాత వారు వాదించినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే పోలీసులు రెయిడింగ్ జరిగినప్పుడు వారు అంత కాన్ఫిడెంట్‌గా కనిపించలేదు. తమను ప్రలోభ పెట్టడానికి వచ్చారని.. తామే పోలీసుల్ని పిలిపించామని వారు చెప్పలేదు.
డబ్బు రాజకీయాలు.. కుట్రల పాలిటిక్స్ !
కారణం ఏదైనా రాజకీయాలు అంటే నేతల్ని డబ్బుతో కొనడం అన్నట్లుగా మారిపోయింది. ఇలా కోట్లకు కోట్లు చేతులు మారిపోతున్నాయి. ఎమ్మెల్యేలు ఫిరాయిస్తున్నారు. ప్రభుత్వాలు పడిపోతున్నాయి. ఈ రాజకీయాలు ఇలా సాగుతూనే ఉన్నాయి.