బీహార్‌లో పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిషోర్ తన పాదయాత్రకు.. ఆరుగురు సీఎంలు సాయం చేస్తున్నారని అంటున్నారు. తాను గతంలో వారికి స్ట్రాటజిస్టుగా సేవలు అందించానని అందుకే వారు ఇప్పుడు సాయం చేస్తున్నారని అంటున్నారు. ఆ ఆరుగురిలో ప్రస్తుతం సేవలు తీసుకుంటున్నది సీఎం జగన్ మాత్రమే. మిగతా వాళ్లంతా ఐ ప్యాక్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. కానీ వైసీపీ మాత్రం ఐ ప్యాక్‌తో ఒప్పందం కొనసాగిస్తోంది. సోషల్ మీడియాలో విచ్చలవిడి ఫేక్ అకౌంట్లతో విరుచుకుపడుతోంది.
ప్రశాంత్ కిషోర్ పాదయాత్రలో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. పబ్లిసిటీకి.. సోషల్ మీడియాకు .. మీడియాకు రూ. కోట్లు ఖర్చుచేస్తున్నారు. తన పర్యటన .. బస ఏర్పాట్లకు రోజుకు కనీసం రూ. ఇరవై లక్షలు ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చులకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయని బీహార్‌లో ఆశ్చర్యపోతున్నారు. ఆయననే నిలదీస్తున్నారు. బీజేపీ ఇస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. అందుకే పీకే ఈ విషయాన్ని బయట పెట్టారు. తనకు బీజేపీ ఇవ్వలేదని.. జగన్ లాంటి సీఎంలు ఇస్తున్నారని అంటున్నారు.
ఏపీ ప్రజల సొమ్ము ఇప్పటికే సలహాదారుల రూపంలో తెలంగాణ వారికి పెద్ద ఎత్తున వెళ్తోంది. ఇప్పుడు బీహార్ రాజకీయ నాయకలకూ చేరుతోంది. మొత్తంగా ఏపీ ప్రజలు చిన్న రోడ్డును బాగు చేసుకోవడానికి నోచుకోలేదు కానీ.. ఇతర రాష్ట్రాల వారికి మాత్రం.. ఆర్థికంగా అండగా నిలబడేంత సహృదయులు అయిపోయారు. పీకేకి ఎవరెవరు ఎంతెంత సొమ్ములిచ్చారో ..బయట పెట్టాలన్న డిమాండ్లు బీహార్‌లో వినిపిస్తున్నాయి. అయితే అంతా బ్లాక్ మనీనేనని అధికారికంగా ఏమీ ఉండదని అందరికీ తెలిసిన బహిరంగరహస్యం.