వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి మధ్య ఆధిపత్య పోరాటం బహిరంగమయింది. బీసీ నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి వారు దీన్ని బయట పెట్టుకున్నారు. నెల రోజుల కిందట సజ్జల రామకృష్ణారెడ్డి బీసీ నేతలను పిలిచి మంచి విందు ఇచ్చి నాలుగు మంచి మాటలు చెప్పి పంపించారు. దానికి సమస్యలపై చర్చ అనే పేరు పెట్టుకున్నారు. తాజాగా విజయసాయిరెడ్డి మరోసారి బీసీ నేతల సమావేశం ఏర్పాటు చేశారు. రెండువందల మందికి పైగా ఆహ్వానించారు. వారితోనూ విజయసాయిరెడ్డి అదే చెప్పారు. అయితే వారి మధ్య రిజర్వేషన్ల చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఆ సంగతి పక్కన పెడితే సజ్జల, విజయసాయి వేర్వేరుగా బీసీ నేతల సమావేశాలు నిర్వహించడం ఏమిటన్నది ఇప్పుడు ఆ పార్టీలోనే హాట్ టాపిక్ అయింది.
పార్టీ పరమైన పదవులు పంచినప్పుడు విజయసాయిరెడ్డికి సోషల్ మీడియా.. అనుబంధ సంఘాలు తప్ప వేరే బాధ్యతలివ్వలేదు. తర్వాత రెండు రోజులకే జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తల బాధ్యత కూడా ఇచ్చారు. ఇటీవల సోషల్ మీడియా బాధ్యతలను కూడా పీకేసి.. సజ్జల కుమారుడికి ఇచ్చారు. దీంతో విజయసాయిరెడ్డికి ఏ పనీ లేకుండా పోయింది జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయసమన్వయకర్తలు మొత్తం సజ్జల చెప్పినట్లే నడుస్తూంటారు. ఆయన ఆదేశాల ప్రకారమే జరుగుతున్నాయి. పదవి పేరుకు మాత్రం విజయసాయిరెడ్డికి ఉంది. తనను దారుణంగా తొక్కేస్తున్నారనుకుంటున్న విజయసాయిఇలా పోటీగా బీసీ నేతల సమావేశాలు పెడుతున్నారని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
విజయసాయిరెడ్డి మొదటి నుంచి పార్టీలో నెంబర్ టు . జగన్ తో పాటు జైలుకెళ్లారు. పార్టీని కూడా నడిపించారు. అధికారంలోకి వచ్చే వరకూ ఆయనే నెంబర్ టు. ఎన్నికల ఫలితాలప్పుడు కూడా జగన్ .. విజయసాయిని హత్తుకుంటున్న ఫోటోనే బయటకు వచ్చింది . అప్పట్లో సజ్జల లేరు. కానీ ఇప్పుడు విజయసాయి దూరమయ్యారు. సజ్జల దగ్గరయ్యారు. అంతా అంతర్గత రాజకీయం అని..ఇది ఎక్కడకు దారి తీస్తుందోనని వైసీపీ నేతలు కంగారు పడుతునన్నారు.