సమంత ప్రధాన పాత్రలో హరి – హరీష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘యశోద’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది. ట్రైలర్ లో యశోద కథపై ఒక ఐడియా ఇచ్చారు. సరోగసి నేపధ్యంలో జరిగే ఒక క్రైమ్ చుట్టూ యశోద కథ వుండబోతుందని అర్ధమౌతుంది.
ఒక ముఠా డబ్బు అవసరం వున్న కొందరు మహిళలని సరోగసి గర్భం ఆశ చూపి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక పెద్ద భవంతిలో ఉంచారు. అక్కడ సమంత కూడా అద్దె గర్భం మోయడానికి వస్తుంది. అయితే సరోగసి వెనుక ఒక పెద్ద క్రైమ్ జరుగుతుంది. ఆ క్రైమ్ ఏమిటి ? యశోద దానిని ఎలా పసిగట్టింది ? ఎలాంటి సవాళ్ళు ఎదురుకుందనేది మిగతా కథని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది.
ట్రైలర్ చాల ఆసక్తికరంగా కట్ చేశారు. సమంత నటనతో పాటు యాక్షన్ కూడా చూపించారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్ ట్రైలర్ కీలకంగా కనిపించారు. మణిశర్మ నేపధ్య సంగీతం, నిర్మాణ విలువలు బావున్నాయి. ”యశోద ఎవరో తెలుసు కదా.. ఆ కృష్ణ పరమాత్మని పెంచిన తల్లి” ట్రైలర్ చివర్లో వినిపించిన ఈ డైలాగ్ ఆకట్టుకుంది. నవంబర్ 11న సినిమా వస్తోంది.