టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోయారంటూ పెద్ద ఎత్తున హడావుడి చేసిన కేసు పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది. ఫామ్‌హౌస్‌లో అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులపై కనీస సాక్ష్యాధారాలను పోలీసులు చూపించలేదు. ఎఫ్ఐఆర్లో రూ. 250 కోట్ల డీల్ అంటూ చెప్పారు కానీ.. స్పాట్లో ఇంత దొరికిందని చెప్పలేదు. పోలీసు వర్గాలు మీడియాకు రూ. వంద కోట్ల నగదు పట్టుకున్నామని సమాచారం ఇచ్చాయి. తర్వాత అది రూ. పదిహేను కోట్లకు తగ్గించాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరుడికి చెందిన నాలుగులో ఉన్న నాలుగు నిండైన బ్యాగుల్ని చూపించి అవే నోట్ల కట్టలని నమ్మించారు. కానీ బయటకు చూపించలేదు. చివరికి అసలు డబ్బులేమీ దొరకలేదని కోర్టుకు చెప్పారు.
డబ్బుల గురించి చెప్పలేదు.. నిలబడని ఏసీబీ సెక్షన్లు !
పైగా నిలబడవని తెలిసి ఏసీబీ సెక్షన్లు పెట్టారు. రేవంత్ రెడ్డిని ఇలాంటి ట్రాప్‌లోనే అరెస్ట్ చేసినప్పుడు ఏసీబీ కేసు పెట్టారు. అప్పట్లో కోర్టు రిమాండ్ విధించిది. కానీ అది ఎన్నికల సంఘం కేసన్న వాదన ఉంది. ఇప్పుడు అసలు డబ్బులు దొరకలేదు.. ఓట్లు అడగలేదు.. ఫామ్‌హౌస్‌లో ఉన్నారని హడావుడి చేసి తీసుకొచ్చారు. ఫలానా మొత్తంలో డబ్బు దొరికిందని కానీ.. డీల్స్‌కు ఆడియో.. వీడియో ఆధారాలున్నాయని కానీ పోలీసులు చెప్పలేదు. దీంతో మొత్తం వ్యవహారంలో తెర వెనుక ఏదో జరిగిందన్న వాదన వినిపిస్తోంది.
ఆడియో, వీడియో ఆధారాల గురించి కోర్టుకెందుకు చెప్పలేదు ?
పోలీసులు లీక్ చేసిన సమాచారం ప్రకారం.. పది నుంచి ఇరవై కెమెరాలను ఫామ్ హౌస్‌లో ముందుగానే పెట్టారు. అన్ని కోణాల్లోనూ రికార్డు చేశారు. రేవంత్ రెడ్డి ఇష్యూలో చంద్రబాబు ఆడియో బయటకు వచ్చినట్లుగా అమిత్ షా ఆడియోలు బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు. వీడియోల్లో మొత్తం రికార్డయిందన్నారు. కానీ ఒక్క ఆధారం కూడా కోర్టుకు సమర్పించలేదు. పట్టుబడిన డబ్బు గురించీ చెప్పకుండా నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చేలా చేశారు.
రాజకీయ కుట్రల్లో పోలీసులు భాగమవుతున్నారా ?
గతంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు రూ. పదిహేను కోట్ల కుట్ర అంటూ … సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోనే ఫేక్ కేసులు పెట్టి.. ఢిల్లీ నుంచి కొంత మంది అరెస్ట్ చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల ఈ అంశంలో కోర్టు గట్టిగానే స్పందించింది. ఆ కేసు విచారణలో ఏం తేలుతుందో కానీ ఈ కేసులో కూడా రూ. పదిహేను కోట్ల కథ వినిపించి.. మొదట్లోనే పట్టు సడలించేశారు. పోలీసుల తీరు చూస్తే ఇదంతా నిజంగానే రాజకీయ డ్రామా.. వారంతా నటులుగా వ్యవహరించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారు. ఈ కేసులో నిజానిజాలు పోలీసులు తేల్చకపోతే.. మొదట ముద్రపడేది వారిపైనే.