రైతులు పాదయాత్ర చేస్తూంటే పోలీసులు వారిపై స్వయంగా దాడులు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలనుకుంటే.. పోలీసు వ్యవస్థ మొత్తం టీడీపీ నేతల ఇళ్ల ముందు మోహరిస్తున్నారు. వారిని బయటకు రానీయకుండా రెండు రోజుల ముందే కట్టడి చేస్తున్నారు. విశాఖలో కబ్జాలపై పోరాటం చేయాలని టీడీపీ నిర్ణయించుకుంది. నిరసనలు చేపట్టాలని అనుకుంది. ఇలా అనుకుందే తడవుగా పోలీసులు అందరి ఇళ్ల ముందు రెండురోజుల ముందే దిగిపోయారు. వారు పాల్గొన్న కార్యక్రమాల్లోనూ చొరబడ్డారు. చివరికి హౌస్ అరెస్టులు చేశారు. ఉత్తరాంధ్ర మొత్తం చోటా, మోటా టీడీపీ నేతలు సహా ఎవర్నీ వదిలి పెట్టలేదు. అందర్నీ అడ్డుకున్నారు.
పోలీసుల తీరు చూసి జనం కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రజాస్వామ్యంలో విపక్షాలు నిరసనలు చేస్తే.. ఇంత దారుణంగా పోలీసులు అడ్డుకోవడం గతంలో ఎప్పుడూ లేదని అంటున్నారు. అదే వైసీపీ నేతలు టీడీపీ నేతల ఇళ్లపైకి దాడులుకు వెళ్లినా.. నిరనసల పేరుతో అనుమతులు పోలీసులు ఇస్తారు . వారు అధికారికంగా ఎలాంటి పత్రాలివ్వరు. కానీ వైసీపీ నేతలు నిరసనలు ప్లాన్ చేసుకుంటే.. చాలు మొత్తం ఎలా కావాలంటే అలా చేసి పెడతారు. రైతుల పాదయాత్ర దారిలో నిరసనలకు అనుమతి ఇస్తారు. దాడులు చేస్తారు. అవే చూపించి.. రైతులే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పాదయాత్రకు అనుమతి రద్దు చేయాలని కోర్టుకు చెబుతున్నారు.
సీఐడీ పోలీసుల వ్యవహారశైలిని కోర్టులు ఎప్పటికప్పుడు తప్పు పడుతున్నాయి. లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే పోలీసులు అందరూ కాదని.. కొంత మంది టార్గెటెడ్‌గా నియమించిన వారే ఇలా చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పోరాటం చేయకుండా ..పోలీసుల్ని పెట్టి నిలువరించడం… దారుణమని.. అది రాజ్యాంగ ఉల్లంఘన అని చెబుతున్నారు