ఎయిమ్స్ ఆస్పత్రిని తమ రాష్ట్రానికి కేటాయించాలని అన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని వెంట పడుతూంటాయి. కావాల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పిస్తామని హామీ ఇస్తాయి. అయినప్పటికీ కేంద్రం కేటాయించదు. అతి కష్టం మీద ఏపీకి కేటాయించింది. టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున భూమి, ఇతర సౌకర్యాలు కల్పించడంతో వేగంగా నిర్మాణం అయింది. కానీ నీరు ఇవ్వాల్సి ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఆ సంస్థకు చుక్కలు చూపిస్తోంది. నీరివ్వాలంటే ఏం చేయాలో ఓ పెద్ద షరతుల జాబితాను పంపింది.
ఏపీ పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం చేసేందుకు కేంద్రం ఎయిమ్స్ ను ఏర్పాటు చేస్తే నీరు కూడా ఇవ్వరా అని ప్రభుత్వంపై ఇటీవల కొందరు కేంద్రమంత్రులు మండిపడ్డారు. దీంతో ప్రభుత్వం తాజాగా నీటిని నీరు సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చింది. కానీ అందులో ఉన్న షరతులు చూస్తే.. ఎయిమ్స్ మంగళగిరిలో ఉండటం ఏపీ ప్రభుత్వానికి ఇష్టం లేదని ఎవరికైనా అర్థమైపోతుంది.
గుంటూరు ఛానల్ లో నీరు ప్రవహించిన సమయంలో 3.50 క్యూసెక్కుల నీటిని ఎయిమ్స్ వినియోగించుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చారు. అయితే అలా ప్రవహిస్తున్నప్పుడు తీసుకోకూడదు. ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా నీటి వినియోగానికి ఎయిమ్స్ కు ఎలాంటి అధికారం లేదు. అదే సమయంలో స్టోరేజి ట్యాంకు నుంచి సొంత ఖర్చులతో పైపులైన్ వేసుకోవాలి.. నీటి పైపులైన్ వేసుకునేందుకు భూసేకరణ వ్యయం కూడా ఎయిమ్సే భరించాలి. అంతే కాదు గృహ వినియోగదారులకు విధించే నీటి ఛార్జీలను ఎయిమ్స్ చెల్లించాలి. నీటి వినియోగాన్ని లెక్కించేందుకు సొంత ఖర్చుతోనే పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. దీన్ని జలవనరుల శాఖ అధికారులు పర్యవేక్షిస్తారు. ఇంతటితో అయిపోలేదు.. ప్రభుత్వం నిర్దేశించిన నీటి ఛార్జీలను ఏడాది ముందే అడ్వాన్సుగా చెల్లించాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతే కాదు.. నీటిని సరఫరా చేయలేకపోతే ఎలాంటి న్యాయవివాదాలను సృష్టించబోమని ముందుగానే ఒప్పందం కూడా ఇవ్వాలట.
వీటిని చూసిన తరవాత ఎవరికైనా ఎయిమ్స్ ప్రభుత్వానిదా.. ప్రైవేటుదా అనే సందేహం వస్తుంది. అత్యున్నత స్థాయి వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుకు.. అందించే ఎయిమ్స్ పై ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరించడం.. అందరికీ ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. ప్రభుత్వ పెద్దల మనస్థత్వానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఎందుకంటే ..ఎయిమ్స్ సేవలు అందించేది .. ఏపీ ప్రజలకే .. ఢిల్లీ వాళ్లకి కాదు.