రాయలసీమ ప్రజలు పాలనా రాజధాని అడగలేదని.. కేవలం కర్నూలుకు హైకోర్టు ఇస్తే చాలంటున్నారని.. అమరావతిలో కాకుండా విశాఖలోనే పాలనా రాజధాని పెడితేనే రాయలసీమకు మేలు చేసినట్లని వైసీపీ నేతలు కొత్త రాగం మొదలు పెట్టారు. విశాఖకు రాజధాని వెళ్తూంటే… ఆ రాజధాని తమకు కావాలని వీరు అడగడం లేదు. అమరావతిలో మాత్రం వద్దు. .విశాఖలోనే ఉంటే సీమకు న్యాయం చేసినట్లేనన్న వాదన వినిపిస్తున్నారు. మధ్యలో ఉన్న అమరావతి రాజధాని కాకుండా ఎక్కడో మూలన ఉన్న విశాఖలో రాజధాని పెట్టడం.. సీమకు దూరాభారమే కదా అంటే.. సీమ రాజధానిని ప్రజలు అడగలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాదిస్తున్నారు.
విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖ ప్రజలు మాత్రం రాజధాని కావాలని ఉద్యమాలు చేస్తేనే ప్రకటించారా అంటే సమాధానం చెప్పలేకపోయారు. ఏకగ్రీవంగా ఎంపిక చేసిన అమరావతిని ఎన్నికల్లో కూడా అదే రాజధాని అని చెప్పి మరీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అడ్డగోలుగా మాట మార్చిన నేతలు ఇప్పుడు.. తమ ప్రాంతం అభివృద్ధి కోసం మాట మాట్లాడటం లేదు. రాజధాని పెడితే అభివృద్ధి జరిగిపోతుందని అనుకుంటే.. రాయలసీమ నేతలు.. రాజధాని అడగాలి. లెక్క ప్రకారం కర్నూలు రాజధానిగా ఉండాలి. అభివృద్ధే ప్రామాణికం అయితే.. ఇంత దాకా వచ్చిన తర్వాత కర్నూలులో రాజధాని పెట్టాలి. కానీ అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.
వైసీపీ నేతలు కూడా కేవలం అమరావతిపై ద్వేషంతో అదీ కూడా జగన్ కు ఇష్టం లేదు కాబట్టి … సీమకు అన్యాయం జరిగినా పర్వాలేదు అమరావతిలో మాత్రం రాజధాని వద్దని వాదిస్తున్నారు. పైగా సీమకు అన్యాయం చేయవద్దని కొత్త రాగంతో బయలుదేరుతున్నారు. వీరి వాదన చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్న ఆలోచన కూడా వీరు చేయడం లేదు.