బాగా సౌండ్ వచ్చిన తరవాత ఒక్కసారిగా నిశ్మబ్దం ఆవరిస్తే.. అది కూడా చాలా వయోలెంట్‌గానే ఉంటుంది. ఒక్కోసారి నిశ్మబ్దమే భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ మౌనం బీజేపీ నేతలకు అలాగే అనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని వారు మథనపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఆయన మాట్లాడితే ఇంకెలా ఉంటుందోననే బీజేపీ నేతల ఆందోళనకు కారణం.
తెలంగాణ సీఎం కేసీఆర్ నోరు తెరవడం లేదు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చే ప్రక్రియను దసరా రోజు ప్రారంభించారు. ఆ రోజే ప్రెస్ మీట్ పెడతామన్నారు. కానీ రోజులు గడిచిపోతున్నాయి. మధ్యలో వారం రోజులు ఢిల్లీ వెళ్లి వచ్చారు. కానీ ఇప్పటి వరకూ మాట్లాడలేదు. ఇప్పుడు బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని స్టింగ్ ఆపరేషన్ చేయించి మరీ బయట పెట్టించారు. సాక్ష్యాలు కూడా ప్రజల్లోకి విడుదల చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ మీడియా ముందుకు రాలేదు. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పలేదు.
కేసీఆర్ మౌనం వెనుక వ్యూహం ఉంటుందని టీఆర్ఎస్ నేతలు చెబుతారు. నిజంగానే కేసీఆర్.. మౌనంగా ఉన్న తర్వాత ఒక్క సారిగా రాజకీయ వ్యూహం మార్చేసుకుని రంగంలోకి దిగుతారు. తెలంగాణ ఉద్యమం నుంచి అదే జరుగుతోంది. మూడు రోజులుగా కేసీఆర్ ఇవాళ మీడియాతో మాట్లాడుతారని లీకులు వచ్చాయి. కానీ అలాంటిది జరగలేదు. ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్‌లోనే ఉన్నారు. వారితో ఏం చేస్తున్నారో కానీ.. ఇంకా మీడియా సమావేశంపై స్పష్టత ఇవ్వలేదు.
మరో వైపు ఎమ్మెల్యేల్ని తీసుకుని ఢిల్లీ వెళ్తారని అక్కడే విషయాన్ని బయట పెడతారన్న ప్రచారం జరుగుతోంది. దానిపైనా స్పష్టత లేదు. బీజేపీ నేతలు మాత్రం కేసీఆర్ ఎంత త్వరగా మౌనం వీడి.. తాను చెప్పాలనుకున్నది.. చేయాలనుకున్నది చేస్తే..తమ ఎదురుదాడి చేసుకోవచ్చని అనుకుంటున్నారు. కేసీఆర్ ఆ చాన్స్ ఎంత వరకూ ఇస్తారో మరి.