కాంట్రాక్టుల్లో 40 శాతం కమిషన్లు తీసుకుంటారని తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక సీఎం బసవరాజు సీఎం .. అందులో కొంత జర్నలిస్టులకు పంచాలనుకున్నారేమో కానీ.. దీపావళి గిఫ్టు పేరుతో బరువైన కవర్లను జర్నలిస్టులకు పంపిణీ చేశారు. దీపావళి పండుగ అయిపోయిన ఒకటి, రెండు రోజుల తర్వాత సీఎంవో బీట్ చూసే జర్నలిస్టులందరికీ.. బస్వరాజు బొమ్మై దీపావళి హ్యాంపర్స్ పేరుతో సీఎంవోలోని ఓ అధికారి.. ప్రముఖ మీడియా జర్నలిస్టులందరికీ కవర్లు పంపిణీ చేశారు. బాగా బరువుగా ఉండటంతో స్వీట్ బాక్సులనుకున్నారేమో కానీ ఆ జర్నలిస్టులు అందరూ తీసుకెళ్లిపోయారు.
అయితే వెంటనే బయటకు వచ్చింది. తాము కవర్లు అందుకున్న మాట నిజమేనని అందులో రూ. లక్ష కంటే ఎక్కువగానే ఉన్నాయని.. డబ్బులను చూసి తిరిగి ఇచ్చేశామని కొంత మంది సీనియర్ జర్నలిస్టులు ధృవీకరించారు. మరికొంత మంది వాటిలో ఎంత ఉందో చూడలేదు కానీ.. డబ్బులు చూసి కవర్లను తిరిగి ఇచ్చేశామన్నారు. ఇలా ముగ్గురు నలుగురు జర్నలిస్టులు తిరిగి ఇచ్చినట్లుగా చెప్పారు.ముఖ్యమంత్రి ఆఫీసు సిబ్బంది ఇచ్చిన కవర్లలో కనీసం రూ. లక్ష నుంచి రూ. రెండున్నర లక్షల వరకూ ఉన్నాయని తెలుస్తోంది.
జర్నలిస్టులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేశారని రాజకీయ పార్టీలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి. ప్రజలకు నిజాలు చెప్పే మీడియాకు కూడా లంచం ఇవ్వాలని ప్రయత్నం చేశారంటే..ప్రభుత్వంలో ఎంత అవినీతి పేరుకుపోయిందో స్పష్టమవుతోదంని అంటున్నాయి. కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేక వార్తలు వస్తున్నాయి. అవినీతిపై కథనాలు వస్తున్నాయి. వీటిని నియంత్రించడానికి కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం ఇలా నేరుగా జర్నలిస్టులకు డబ్బులు పంపిణీ చేయడం వివాదాస్పదంగా మారింది.