పవన్ కల్యాణ్ పై వైసీపీ అధినేత జగన్ పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయనేదో కాపు కులానికి నాయకుడన్నట్లుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాపులు మాత్రమే ఆయన వెనుకఉన్నట్లుగా కలరింగ్ ఇచ్చేందుకు కాపు నేతల్నే పవన్ కల్యాణ్‌పై ప్రయోగిస్తున్నారు. మరోసారి అదే ప్రయోగం చేయబోతున్నారు. పవన్ కల్యాణ్ ఆదివారం జనసేన పార్టీ పీఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయ వ్యూహాలను ఖరారు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయనకు పోటీగా కాపు నేతలందర్నీ రాజమండ్రి పంపించి సమావేశం ఏర్పాటు చేయిస్తున్నారు వైసీపీ పెద్దలు.
వైసీపీలో ఉన్న చిన్నా పెద్దా.. కాపు నేతలంతా ఆదివారం రాజమండ్రిలో సమావేశం ఆవ్వాలని వైసీపీ పెద్దలు ఆదేశించారు. ఎజెండా ఏమిటంటే కాపు ఓటు బ్యాంక్ పవన్ కల్యాణ్ వైపు లేదు.. తమ వైపే ఉందని చెప్పడం. ఇటీవల పవన్ కల్యాణ్ కాపులంతా తన వైపే ఉన్నారని వ్యాఖ్యానించారని.. అది తప్పని.. జగన్ వైపు ఉన్నారని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజంగా అలా చెప్పాలనుకుంటే పవన్ ఆ మాటలన్న తర్వాతి రోజు చెప్పొచ్చు.. కానీ పవన్ తమ పార్టీ పీఏసీ సమావేశం పెట్టుకున్న రోజునే ఆయనపై ఎటాక్ చేయడానికి రెడీ అయిపోవడం.. వైసీపీ ఎదురుదాడి వ్యూహానికి పరాకాష్ట అనుకోవచ్చు.
ఇప్పటికి పవన్‌ను టార్గెట్ చేయాలంటే.. కేవలం కాపు నేతల్నే రంగంలోకి దింపుతున్నారు. దీని వల్ల కాపు యువతకు.. వైసీపీ నేతలు దూరమవుతున్నారు. సొంత కులంలోనే ఆదరణ కోల్పోతున్నారు. పవన్ కల్యాణ్ తనకు కులం లేదని.. తన ఫ్యాన్స్‌లో అన్ని వర్గాల వారు ఉన్నారని చెబుతూ ఉంటారు. అయితే అప్పుడప్పుడూ కాపుల మద్దతు తనకు ఉందని చెబుతూండటం వైసీపీ నేతలకు నచ్చడం లేదు.