తెలంగాణలో సీబీఐకు జనరల్ కన్సెంట్ రద్దు చేశారు. నిజానికి మూడు నెలల కిందటే జీవో ఇచ్చారు. ఇప్పుడు బయట పెట్టారు. కానీ సీబీఐ అధికారులు ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణలో సోదాలు చేశారు . ఆ జీవో ఇచ్చిన తర్వాతనే బోయినపల్లి అభిషేక్‌ను అరెస్ట్ కూడా చేసి తీసుకెళ్లారు. అప్పట్లో బయట పెట్టని జీవోను ఇప్పుడు బయట పెట్టారు. దీనికి కారణం.. ఆ జీవో సీబీఐని ఏ విధంగానూ అడ్డుకోలేదని తెలియడమే.
ఢిల్లీలో నమోదైన కేసుల విచారణను రాష్ట్రాల్లో చేయాల్సి వస్తే అలాంటి విచారణను ప్రస్తుతం తెలంగాణ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులు ఆపలేవు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కేసు కూడా అక్కడే నమోదైంది. అందుకే తెలంగాణలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసినా పెద్దగా ప్రభావం ఉండదు. రాష్ట్రాలు తమ సమ్మతి ఉపసంహరించుకున్నంత మాత్రాన సీబీఐ ఆ రాష్ట్రంలో అడుగు పెట్టడం ఆపలేరు. కోర్టులు ఆదేశిస్తే… దర్యాప్తు చేయవచ్చు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం కూడా అడ్డుకోలేదు.
తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో వల్ల ఎవరికి ఎక్కువ లాభం అంటే.. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పని చేసే ఉ్దయోగులకు. తెలంగాణలో ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలో అవినీతి జరిగిందని సమాచారం సీబీఐకి అందితే… కేసు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర వివరాలు పంపించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే అనుమతి మేరకే సీబీఐ కేసు దర్యాప్తులో ముందుకెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణలో ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. వీటన్నింటిపై సీబీఐ కేసులు నమోదు చేయాలంటే ప్రతి కేసుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి వస్తుంది.
అదే సమయంలో రాజకీయ పరమైన కేసుల విచారణకు సీబీఐ కోర్టుకెళ్లి ఎన్నో సార్లు జీవోలను కొట్టి వేయించింది . లాలూ ప్రసాద్ యాదవ్ , హిమాచల్ ప్రదేశ్ సీఎంగా పనిచేసిన వీరభద్రసింగ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు మధుకోడా లు ఇలాగే జీవోలు జారీ చేశారు కానీ.. కోర్టు కొట్టి వేసింది.జనరల్ కన్సెంట్ రద్దు చేయడం ద్వారా సీబీఐకి కొన్ని పరిమితులు పెట్టగలిగినప్పటికీ.. ఇలాంటి దాడులు, అరెస్టులు చేయాలనుకుంటే ఈడీకి ఎలాంటి అనుమతులు అవసరం లేదు.