సీఐడీ అధికారి సునీల్ .. విపక్ష నేతలను టార్గెట్ చేసి అక్రమ అరెస్టులు చేసి.. వారిని కస్టోడియల్ టార్చర్ చేయడంలో కింగ్ పిన్ అని టీడీపీ రోజూ విమర్శిస్తోంది. చేయాల్సినదంతా చేసి ప్రభుత్వం మారే నాటికి వైసీపీ తరపున ఎంపీ లేదా ఎమ్మెల్యే టిక్కెట్ పొంది రాజకీయంగా రక్షణ పొందుతామనుకుంటున్నారని.. తాము వదిలే ప్రశ్నే లేదని టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు పీవీ సునీల్ కూడా ఓపెన్ అవుతున్నారు. ఆయనకు ఓ క్రిస్టియన్ మత సంస్థ ఉంది. స్వచ్చంద సంస్థ పేరుతో నడుపుతూ ఉంటారు. ఆ సంస్థ కార్యకలాపాలు ఇటీవలి కాలంలో బాగా పెంచారు.
గతంలో ఈ సంస్థ సభలో ప్రసంగిస్తూ ఆయన హిందూత్వంపై చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. వాటిపై కేంద్రానికి కూడా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కేంద్రం నుంచి లేఖలు వచ్చినా రాష్ట్రం పట్టించుకోలేదు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ లేఖలన్నింటిపైనా చర్యలుంటాయేమో కానీ ఇప్పుడు మాత్రం సేఫ్. ఇప్పుడు తన స్వచ్చంద సంస్థ తరపున సభల్లో మాట్లాడుతూ దళిత వాడల్నిపంచాయతీలుగా చేయాలని.. వాటికి వేల కోట్ల నిధులు కేటాయించాలని.. ఈ మేరకు మేనిఫెస్టోలో పెడతామని ఆ పార్టీలు చెప్పాలని సవాల్ చేశారు.
తన మీద విమర్శలు చేస్తున్న వారు దీనికి సమాధానం చెప్పాలన్నారు. పీవీ సునీల్ అధికారాన్ని దుర్వినియోగం చేసి… ప్రతిపక్షాలపై కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడుతున్నారని విమర్శలు చేస్తే.. ఆయన దళిత వాడులు.. పంచాయతీలు అంటూ రాజకీయ సవాళ్లు ఇతర పార్టీలకు చేస్తున్నారు. అప్పుడే ఆయన రాజకీయం ఒంటబట్టించుకుంటున్నారని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.