”సినిమాల్ని పాన్ ఇండియా ఫ్యాక్టర్ ని దృష్టిలో పెట్టుకొని చేయం… సినిమా బాగుంటే అదే పాన్ ఇండియా అవుతుంది” అని దర్శకులు, హీరోలు బయటకు చెబుతుంటారు కానీ, లోపల మాత్రం వాళ్లని పాన్ ఇండియా ఆలోచనలు వెంటాడుతుంటాయి. ఈ సినిమాలో `పాన్ ఇండియా` కంటెంట్ ఏముందంటూ… కథ దగ్గర్నుంచే తీవ్రంగా ఆలోచించడం మొదలెడుతున్నారు. దాంతో పాన్ ఇండియా అనేది ఓ ఒత్తిడిలా మారుతోంది. ఇప్పుడు త్రివిక్రమ్ విషయంలో అదే జరుగుతోంది. ఎప్పుడూ లేనిది… కథ విషయంలో త్రివిక్రమ్ మల్లగుల్లాలు పడుతున్నాడు. మహేష్ బాబుతో సినిమా విషయంలో ఓ అడుగు ముందుకు పడుతుంటే, పది అడుగులు వెనక్కి లాగుతుండడం… త్రివిక్రమ్ అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన కథ ఇంత వరకూ సెట్ కాకపోవడం వెనుక పాన్ ఇండియా స్ట్రాటజీనే ప్రధానమైన కారణం.
అగ్ర హీరో సినిమా అంటే కచ్చితంగా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో తీయాల్సిందే. మహేష్ బాబు సినిమా కూడా ఇప్పుడు పాన్ ఇండియా వరకూ వెళ్లాలి. అయితే ఇప్పటి వరకూ త్రివిక్రమ్ అలాంటి స్క్రిప్టు తయారు చేయలేదు. తన దారిలోనే సున్నితమైన మానవ సంబంధాలు, యాక్షన్, వినోదం, హీరోయిజం మేళవించి కథలు రాసుకొంటాడు. ఇప్పుడు సడన్ గా వాటిని పాన్ ఇండియా ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మార్చుకోవాల్సివస్తోంది. అందుకే మహేష్ కథ ఓ పట్టాన తెవలడం లేదని టాక్. ఆమధ్య మహేష్ పై ఓ ఫైట్ తెరకెక్కించారు. టాకీ ఎప్పుడో మొదలవ్వాల్సింది. స్క్రిప్టుని లాక్ చేయడంలో జాప్యం వల్లే… ఇప్పటి వరకూ షూటింగ్ మొదలు కాలేదు. ఇప్పుడు ఆల్రెడీ రాసేసిన కథకి పాన్ ఇండియా టచ్ ఎలా ఇవ్వాలా? అని త్రివిక్రమ్ తర్జన భర్జనలు పడుతున్నాడని టాక్. ఈ ప్రోసెస్ ఎప్పుడు పూర్తవుతుందో? మహేష్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో?