చిత్రసీమలో ఒక్కో సీజన్లో ఒక్కో ఫార్ములా వర్కవుట్ అవుతుంటుంది. కొన్ని సీజన్లలో ప్రేమ కథలు ఆడేస్తుంటాయి. ఇంకొన్ని సార్లు క్రైమ్ కామెడీలు వర్కవుట్ అవుతుంటాయి. ఈ సీజన్ మాత్రం భక్తి, భక్తిలదే. డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు, సూపర్ నేచురల్ పవర్ తో ముడి పడి ఉన్న కథలు ఈమధ్య తెగ ఆడేస్తున్నాయి. మొన్న అఖండ, నిన్న కార్తికేయ 2, ఈరోజు కాంతార… దీనికి అతి పెద్ద ఉదాహరణలు.
ఈ మూడు సినిమాల్లోనూ భక్తి, శక్తి అనే రెండు కాన్సెప్టులూ ఉన్నాయి. అలాగని మరీ దేవుడు, ఆచారాలు అని డీప్ గా వెళ్లలేదు. ఆ అంశాల్ని ఎక్కడ వాడాలో.. అక్కడ వాడుకొంటూ వచ్చారు. హిందుత్వ నినాదం ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. అది రాజకీయాల్లో బలమైన సెంటిమెంట్. అయితే.. ఇప్పుడు సినిమాలకూ ఈ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అవుతోంది. ఎప్పుడైతే అఖండ, కార్తికేయ, కాంతార లాంటి కథలు వర్కవుట్ అయ్యాయో… ఇప్పుడు ఆ తరహా కథలకు జల్లెడ పడుతున్నారు. సుధీర్ బాబు `హరోం హర` కీ డివోషన్ టచ్ ఉంది. త్వరలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ సినిమా చేయబోతున్నాడు. దాంట్లోనూ దైవ శక్తికి సంబంధించిన అంశాలున్నాయి. పైగా ఇలాంటి పాయింట్లు పాన్ ఇండియా వ్యాప్తంగా వర్కవుట్ అవుతాయి. అందుకే దర్శక నిర్మాతలూ, హీరోలూ ఇలాంటి కథలపై మక్కువ చూపిస్తున్నారు. గ్రాఫిక్స్ మాయాజాలం వాడుకొంటూ, ప్రేక్షకుల్ని ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన సినిమాలకు ఇప్పుడు ఆదరణ బాగుంది. దానికి దేవుడు అనే పాయింట్ కూడా జోడిస్తే… హిట్టు పడినట్టే. అందుకే ఇంకొన్నాళ్ల పాటు ఈ తరహా కథలు రాజ్యమేలబోతున్నాయి.