ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలు వినేందుకు ప్రజాదర్భార్ పెట్టాలని అనుకున్నారు. చాలా సార్లు ప్రకటించారు కానీ పెట్టలేకపోయారు. కనీసం ఫోన్లో అయినా వారికి అందుబాటులో ఉండాలని “జగనన్నకు చెబుదాం” అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. దీన్ని కూడా నవంబర్ ఫస్ట్ వీక్‌లో ప్రారంభించాలనుకున్నారు కానీ ఫోన్ లైన్స్ బిజీ అనుకున్నారేమో కానీ నెలాఖరుకు వాయిదా వేశారు. నిజానికి ప్రజా సమస్యల పరిష్కారనికి స్పందన అనే కార్యక్రమం ఉంది. అది తూ తూ మంత్రంగా మారిపోయింది. దీంతో ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోంది.
గ్రామ సచివాలయాలు పెట్టడం ద్వారా.. వాలంటీర్లను నియమించడం ద్వారా సమస్య లు పరిష్కారం కాకపోగా మరింత పెరిగాయి. వారిపైనే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. పథకాల్లో అవినీతి జరుగుతోందని.. అనర్హులకు ఇస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం పెట్టాలని నిర్ణయించుకున్నారు. విశాఖలో జనవాణికి ప్రభుత్వం ఆటంకాలు కల్పించింది. దీంతో అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు పెట్టాలని నిర్ణయించారు. ఈ పరిణామంతో జగన్ కూడా ఐ ప్యాక్ సలహాతో జగనన్నకు చెప్పుకుందా అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.
నిజానికి వైఎస్ఆర్ కుటుంబం పేరుతో ఎన్నికలకు ముందు ఇలాంటిది ప్రారంభించారు. చాలా మంది పేర్లు నమోదు చేసుకుని సమస్యలు చెప్పుకున్నారు. అధికారం అందిన తర్వాత అసలు పట్టించుకోనే లేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ ప్రారంభించిన కార్యక్రమాన్ని కౌంటర్‌గా కొత్తగా ఒకటి ప్రారంభిస్తున్నారు. దీన్నైనా సరిగ్గా నడుపుతారో.. ప్రకటనల్లాగే ఉంచుతారో చూడాలి.