గత ప్రభుత్వ పథకాలు నిలిపివేయడం.. కొన్నాళ్లు పెండింగ్ పెట్టి కొత్తగా ఇస్తున్నట్లుగా అమలు చేయడం ఈ ప్రభుత్వ విధానం. ఇప్పుడు కాపు రిజర్వేషన్లు కూడా అదే పద్దతిలో ఇచ్చే ఆలోచన చేస్తున్నారన్న అభిప్రాయం వైసీపీలో వినిపిస్తోంది. గతంలో అంతో ఇంతో మద్దతు ఇచ్చిన కాపు సామాజికవర్గం ఇప్పుడు పూర్తిగా దూరమైపోయిందని… పవన్ వైపు సంఘటితమవుతోందన్న నివేదికలు రావడంతో .. పవన్‌పై ఏకపక్ష దాడి చేయడంతో పాటు.. వాళ్ల సుదీర్ఘ కాల డిమాండ్ అయిన రిజర్వేషన్లను కల్పించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
కాపులకు దశాబ్దాల కాలంగా ఉన్న రిజర్వేషన్ కలను గత ప్రభుత్వం సాకారం చేసింది. నేరుగా రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాని పరిస్థితుల్లో కేంద్రం చేసిన కొత్త చట్టం ద్వారా అవకాశాన్ని దొరకబుచ్చుకుని వారికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించింది. అసెంబ్లీ ఆమోదం కూడా అయిపోయింది. గెజిట్ కూడా వచ్చింది. సర్టిఫికెట్లు జారీ చేస్తే సరిపోతుంది. కానీ జగన్ ప్రభుత్వం వచ్చి రిజర్వేషన్లను తీసేసింది. గత ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేసింది. దీంతో కాపులు తీవ్రంగా నష్టపోయారు.
రిజర్వేషన్లు రద్దు చేయడం అన్యాయమని.. పునరుద్ధరించాలని మొదట్లో ముద్రగడ పద్మనాభం ఒకటి రెండు లేఖలు రాసినా తర్వాత సైలెంట్ అయిపోయారు. గతంలో బీజేపీ ఏపీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు కన్నా ఈ రిజర్వేషన్లను తీసేయడం కాపులను తీవ్రంగా మోసం చేయడమేనని లేఖ రాశారు. కానీ జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్లీ కన్నా సోమవారం లేఖ రాశారు. తీసేసిన రిజర్వేషన్లు తక్షణం అమలు చేయాలన్నారు. కన్నా ఇప్పుడు బీజేపీతో అంటీముట్టనట్లుగా ఉన్నారు. ఈ అంశంపై మరింత విస్తృతంగా కాపుల్లో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
కాపులకు ఈ ప్రభుత్వంలో ఎలాంటి సాయం అందలేదు. చాలా వరకూ పథకాలు మిస్ అయ్యాయి. విదేశీ విద్య పథకం అందకుండా చేయడంతో చాలా మంది నిరాశకు గురయ్యారు. కార్పొరేషన్ నుంచి పైసా నిధులు రావడం లేదు. అమ్మఒడి వంటిపథకాల డబ్బులే కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఈ అసంతృప్తిని గతంలో చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్లు తొలిగించినందున.. వాటిని మళ్లీ ఇస్తే తగ్గించవచ్చనే ప్లాన్ కు వైసీపీ పెద్దలు వచ్చారు. మరి చేస్తారా లేకపోతే.. వారికి చేసేదేముందని ఊరుకుంటారా .. అనేది వేచి చూడాలి.