ఓ సినిమా విడుదల చేయాలంటే అనేక ఆటంకాలు. చెప్పిన టైమ్ కి రిలీజ్ చేయకపోవడం చాలా సాధారణంగా జరిగే విషయం. ఒక్కో సినిమా ఆరు నెలలు, యేడాది ఆలస్యం అవుతుంటాయి. అయితే ఓ సినిమా ఏకంగా 40 ఏళ్ల తరవాత రిలీజ్ అవుతోంది. అవును.. ఏఎన్నార్ నటించిన `ప్రతి బింబాబు` 1982లోనే పూర్తయింది. అయితే అనేక కారణాల వల్ల అప్పట్లో ఈ సినిమా విడుదల కాలేదు. మధ్యలో చాలాసార్లు ప్రయత్నించినా ఆర్థిక పరమైన లావాదేవీలు సెటిల్ అవ్వకపోవడంతో రిలీజ్ కుదర్లేదు. ఇప్పుడు 40 ఏళ్ల తరవాత ఈనెల 5న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఏఎన్నార్ సరసన జయసుధ కథానాయికగా నటించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకొంది. ఇప్పటికైతే ఏఎన్నార్ నటించిన చివరి చిత్రం `మనం`గా రికార్డుల్లో ఉంది. `ప్రతిబింబాలు` రిలీజ్ అయితే.. ఏఎన్నార్ చివరి చిత్రంగా ఈ సినిమా రికార్డులకెక్కుతుంది. సినిమా పాతదే అయినా, ఇప్పటి 4కే, డీటీఎస్ టెక్నాలజీని మేళవించి విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.