ప్రజాస్వామ్యం అంగడి సరుకైపోయింది. ఓట్ల కొనుగోలులో విజేతే.. ప్రజాప్రతినిధి అయ్యే పరిస్థితి వచ్చింది. ఓటుకు నాలుగు వేల చొప్పున రాజకీయ పార్టీలు పంచుతున్నాయి. అంతా బహిరంగమే. పంచలేని పార్టీ వెనుకబడిపోతోంది. ఈ విషయంలో ప్రజా చైతన్యం ఎలా ఉందంటే… డబ్బులివ్వని పార్టీ ప్రతినిధుల్ని నిందించేతంగా ఉంది. నిలదీసేంతగా.
మూడో తేదీన పోలింగ్ జరగనుంది. తెలంగాణ రాజకీయాలను మార్చేస్తుందని భావిస్తున్న ఉపఎన్నికలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అత్యంత ఖరీదైన ఉపఎన్నికగా ఇప్పటికే పేరు తెచ్చుకుంది. దానికి తగ్గట్లే రాజకీయ పరిణామాలూ హై టెన్షన్‌గా చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీలు ఇప్పటి వరకూ పెట్టిన ఖర్చు ఓ ఎత్తు.. పోలింగ్ ముందు రోజు చేసే ఖర్చు ఓ ఎత్తు. అంటే ఓటర్లకు డబ్బులు పంచడం. రాజకీయ పార్టీలు..దీన్ని గౌరవంగా పోల్ మేనేజ్ మెంట్ అని పిలుచుకుంటాయి. ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే టీఆర్ఎస్, బీజేపీ ధన శక్తి ముందు కాంగ్రెస్ పోటీ పడలేకపోతోంది. చివరి క్షణంలో ఏమైనా మ్యాజిక్ చేస్తారేమో కానీ ఇప్పుడైతే పోల్ మేనేజ్మెంట్లో టీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయి.
పోలీసులు పెద్ద ఎత్తున డబ్బులు పట్టుకున్నారు. మునుగోడులో దొరికిని కాకుండా.. మునుగోడు కు తరలించేందుకు హైదరాబాద్ నుంచి తీసుకెళ్తున్న వాటినీ పట్టుకున్నారు. అలాగే మునుగోడు ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ.. ఫామ్ హౌస్ కేసు నమోదవడం సంచలనం సృష్టించింది. అదే స్థాయిలో డబ్బుల పంపిణీ చేస్తున్నారు.