మూడు రాజధానులతో మూడు ప్రాంతాల అభివృద్ధి అని చెబుతున్న వైసీపీ అదంతా ప్రజల్ని మభ్య పెట్టడానికేనని బయటకు చెప్పేస్తోంది. మూడు రాజధానుల్లో ఒక రాజధాని అంటే జనం నమ్మడం లేదని.. ఏకైక రాజధాని విశాఖ అనే ప్రచారం ప్రారంభించారు. దీంతో ఇతర చోట్ల జనం విస్తుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఒకే రాజధాని వాదన వినిపించడం ప్రారంభించారు. ఒకే రాజధాని.. అది విశాఖ మాత్రమే అంటున్నారు.
హైకోర్టు ఓ చోట, అసెంబ్లీ మరో చాట ఉన్నంత మాత్రాన వాటిని రాజధానులని పిలవడం లేదని ధర్మాన చెబుతున్నారు. కర్నూలులో హైకోర్టును పెట్టవచ్చు కానీ దాన్ని రాజధానిగా పిలువలేమని ధర్మాన చెబుతున్నారు. అలాగే అసెంబ్లీ ఉన్నంత మాత్రాన అమరావతి రాజధాని కాదని ఆయన అంటున్నారు. సాంకేతికంగా ధర్మాన చెప్పింది నిజమేనని నిపుణులు అంటున్నారు. ధర్మాన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నేతల నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం కావడం లేదు. ఓ వైపు అమరావతి నుంచి పరిపాలన చేస్తూ.. అభివృద్ధి పేరుతో మూడు రాజధానుల నినాదం చేస్తున్నారు. గతంలో ప్రత్యేకహోదా వస్తే ప్రతీ జిల్లా హైదరాబాద్ అవుతుందని చెప్పిన తరహాలోనే ఇప్పుడు మూడు రాజధానులు చేస్తే అంతా అభివృద్ధి అవుతుందని వాదిస్తున్నారు. కానీ ఇది కూడా కపట నినాదమేనని ధర్మాన లాంటి వాళ్లు నేరుగానే చెబుతున్నారు.
అధికార వైసీపీ తాము మూడు రాజధానుల విధానానికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది. ఇతర పార్టీలు, ప్రజాసంఘాలు అన్నీ తమ మద్దతు అమరావతికేనని చెబుతున్నాయి. చట్టం, రాజ్యాంగం కూడా అమరావతికే మద్దతుగా నిలిచింది. అయితే కొత్తగా ఏపీ సీఎం జగన్ .. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పాలన చేస్తే అదే రాజధాని అని… ఆ విషయాన్ని ఇతరులు నిర్ణయించలేరని చెబుతున్నారు. ఇలా మూడు రాజధానులు కాదు.. ఒక్క రాజధాని అంటూ వైసీపీ రాష్ట్ర భవిష్యత్‌ను గంగలో కలిపేసింది.