ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును మార్చేసి తన తండ్రి పేరును పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే… చకచకా ఎక్కడా ఎన్టీఆర్ అనే పేర్లను లేకుండా చేసేశారు. చివరికి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా తొలగించి వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్టబోతున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ అని కనిపించే బోర్డును తీసేశారు.. డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ వర్శటీ అని మార్చేశారు. వెబ్ సైట్లలో ఎక్కడా ఎన్టీఆర్ అనే పేరు లేకుండా చేశారు. ఇక చూసేవారికి కూడా ఆ పేరు కనిపించకుండా చేయడానికి ఆఘమేఘాల మీద పనులు చేసేశారు.
బోర్డుల మీద.. మాత్రమే కాదు.. శిలాఫలాకాల మీద కూడా ఎన్టీఆర్ పేరు ఉండకుండా పనులు చేస్తున్నారు. చిన్న చిన్న లెటర్ ప్యాడ్లు కూడా కొత్తవి తీసుకొచ్చేశారు. ఇక డిజిటల్ సైన్ బోర్డును కొత్తగా ఏర్పాటు చేసి.. అందులో పెద్దగా డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీ అని భారీగా కనిపించేలా చేసుకున్నారు. ప్రాంగణంలో ఓ ఎన్టీఆర్ విగ్రహం ఉంది. దాన్ని కూడా అక్కడ్నుంచి తప్పించి వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక ముందు జారీ చేసే సర్టిఫికెట్లలోనూ వైఎస్ఆర్ పేరు కనిపించనుంది. అయితేఇంత కాలం జారీ చేసిన సర్టిఫికెట్లను కూడా కొత్త పేరుతో రీ ఇష్యూ చేస్తారో లేదో స్పష్టత లేదు.
అయితే ఈ యూనివర్శిటీ పేరు మార్పు సర్టిఫికెట్లను జారీ చేయాలంటే.. మెడికల్ కౌన్సిల్ అనుమతి ఉండాలన్న వాదన వినిపిస్తోంది. వాటి సంగతేమో కానీ.. ముందు పేర్లు మార్చడం.. విగ్రహాలు మార్చడాన్ని మాత్రం ప్రభుత్వం పూర్తి చేసేసింది. ఏపీలో వైద్య విద్యకు ఓ యూనివర్శిటీని ఏర్పాటు చేసి.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా దాన్ని విజయవాడలో పెట్టిన మహానుభావుడికి చేయాల్సినంత అవమానం చేసేశారు.