రాజధాని అమరావతిలోనే ఉండాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చిన తరువాత, పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముందని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రైతుల పాదయాత్రలో తాము కూడా పాల్గొనే అవకాశం ఇవ్వాలని రైతాంగ సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అమరావతి రాజధాని కావాలంటూ రైతులు ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారని, కర్నూలులో హైకోర్టు కావాలని అక్కడ వాళ్లు చేస్తున్నారని, విశాఖలోనూ గర్జనలు చేస్తున్నారని.. రాజధానికి సంబంధించి కూడా మేము తీర్పులో స్పష్టంగా చెప్పామని, అటువంటప్పుడు ఇంకా పాదయాత్రలు, నిరసన కార్యక్రమాలు ఎందుకు అని ధర్మాసనం ప్రశ్నించింది.
రాజధాని అమరావతిపై తీర్పు ఇచ్చిన తరువాత …. ప్రభుత్వం మూడు రాజధానులకు అనుకూలంగా మంత్రులతో ప్రకటనలు చేయిస్తూ, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోందని, కర్నూలులో ర్యాలీలను ప్రోత్సహిస్తోందని పిటిషనర్ తరపు లాయర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తరువాత, మూడు రాజధానులకు అనుకూలంగా, మరోవైపు అమరావతికి అనుకూలంగా పాదయాత్ర చేయడం మంచిది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై ప్రభుత్వం వేసిన కౌంటర్‌ను పరిశీలించాలని నిర్ణయించింది.
మరో వైపు అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి ఇస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు నేడో రేపో పిటిషన్ దాఖలు చేయనున్నట్లుగా ప్రభుత్వ వర్గాలుచెబుతున్నాయి. రైతులు షరతులు ఉల్లంఘిస్తున్నందునే పాదయాత్ర అనుమతి రద్దు చేయాలని ప్రభుత్వం హైకోర్టును కోరిందని.. డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లుగా తెలుస్తోంది.