ప్రధాని మోదీ టూర్ ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖకు వస్తున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాధారణంగా బహిరంగసభ పార్టీది అవుతుంది. కానీ ఇక్కడ పార్టీ తరపున బహిరంగసభ పెట్టుకుండా.. విజయసాయిరెడ్డి అడ్డం పడుతున్నారు. చొరవ తీసుకుని మరీ విశాఖలో బహిరంగసభ ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెబుతున్నారు. ఈ మేరకు అధికారులందర్నీ వెంటేసుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మీడియాకు పిలిచి మరీ చెప్పారు.
ఏయూలో పలు ప్రాంతాలను పరిశీలించారు. లక్ష మందిని జన సమీకరణ చేస్తామని.. ఇది పార్టీలకు అతీతమైన సభ అని విజయసాయిరెడ్డి చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వం బహిరంగసభ నిర్వహించాల్సిన అవసరం ఏమిటో విజయసాయిరెడ్డికే తెలియాలి. కేవలం వైసీపీ నేతలతో కలిసి మోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించడం .. అధికారులందర్నీ ఆయన ఈ పని మీదే తిప్పుకోవడం పై విశాఖలో చర్చ జరుగుతోంది. అసలు విజయసాయిరెడ్డికి.. విశాఖతో సంబంధం ఏమిటనేది కూడా వైసీపీ నేతల్లో గుసగుసలకు కారణం అవుతోంది.
మరోవైపు ఏపీ బీజేపీ నేతలు ఉడికిపోతున్నారు. ప్రధాని ఏపీ పర్యటనకు వస్తూంటే.. బీజేపీ నేతలకు కనీస సమాచారం లేకపోగా.. మొత్తం పర్యటన మొత్తం వైసీపీ హైజాక్ చేస్తూండటంతో వారికి అయోమయంగా ఉంది. ఎలా స్పందించాలో తెలియడం లేదు. బహిరంగసభను బీజేపీ నిర్వహిస్తుందన్నదానిపైనా వారికి సమాచారం లేదు. ఎలాగైనా బీజేపీతో పరోక్ష సంబంధాలు గట్టిగా కొనసాగించాలన్న లక్ష్యంతో విజయసాయిరెడ్డి ఉన్నారు. రాజకీయాలే్ కాదు.. ఆయన అల్లుడికి సంబంధించిన ఈడీ వ్యవహారాలు కూడా ఇందులో ఉన్నాయి.
మొత్తంగా బీజేపీ నేతలు మోదీ పర్యటన విషయంలో.. వైసీపీకే వదిలేస్తారో లేకపోతే.. బీజేపీ పెద్దలతో చర్చించి.. విజయసాయిరెడ్డి జోక్యాన్ని నియంత్రిస్తారో వేచి చూడాలి.